
వీడని బారులు.. తీరని తిప్పలు
సిద్దిపేట రూరల్: రాఘవపూర్‌లో రైతుల నిరసన
నంగునూరు: పాలమాకుల పీఏసీఎస్ వద్ద బారులు తీరిన రైతులు
నంగునూరు(సిద్దిపేట): జిల్లాలో యూరియా కష్టాలు తొలగడంలేదు. పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరిన రైతులే కనిపిస్తున్నారు. రోజంతా నిరీక్షించినా అందని దుస్థితి నెలకొంది. నంగునూరు మండలం పాలమాకుల పీఏసీఎస్‌కు ఆదివారం యూరియా వస్తోందని తెలియడంతో తెల్లవారు జామునే చుట్టుపక్కల గ్రామాల రైతులు వచ్చి క్యూలైన్‌లో నిలబడ్డారు. అయితే ఇప్పటి వరకు తీసుకోని వారికి మాత్రమే ఇస్తామని చెప్పడంతో గందళగోళానికి దారి తీసింది. ఆగ్రహించిన కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న రాజగోపాల్‌పేట ఎస్‌ఐ సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. గొడవ సద్దు మణగడంతో అధికారులు టోకెన్లు పంపిణీ చేశారు. పోలీసుల పహారాలో యూరియా అందజేశారు. ఈసందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఒక బస్త యూరియాకు మూడు సార్లు క్యూలైన్‌లో నిలబడాల్సి వచ్చిందన్నారు.
పోలీసుల పహారాలో..
కొమురవెల్లి(సిద్దిపేట): మండల కేంద్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల పహారాలో ఆదివారం యూరియా పంపిణీ చేశారు. రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ, ఏఈఓలతో కలసి ఎస్‌ఐ రాజు, సిబ్బంది పహారాలో రైతులకు టోకన్లు జారీ చేశారు. రైతు సేవా కేంద్రం వద్ద యూరియాను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కావాల్సినంత యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
రాఘవపూర్‌లో ధర్నా
సిద్దిపేటరూరల్: సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతూ సిద్దిపేట– ముస్తాబాద్ రహదారిపై ఆదివారం రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. గంటల తరబడి క్యూ లైన్‌లలో వేచి ఉంటే కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. పాలకులు స్పందించి కావాల్సిన యూరియా సరఫరా చేయాలన్నారు.
యూరియా కోసం పడిగాపులు

వీడని బారులు.. తీరని తిప్పలు