
విద్యారంగం బలోపేతం చేద్దాం
● ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపు
● గజ్వేల్‌లో టీపీటీఎఫ్ విద్యాసదస్సు
● హాజరైన ప్రొఫెసర్ కాశీం, విమలక్క
గజ్వేల్: ప్రభుత్వ విద్యారంగం బలోపేతమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రజ్ఞాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎల్లయ్య పదవీవిరమణ సందర్భంగా స్థానిక ప్రజ్ఞాగార్డెన్స్‌లో టీపీటీఎఫ్ విద్యా సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ విద్యారంగాభివృద్ధికి టీపీటీఎఫ్ నిబద్దతతో పనిచేయాలన్నారు. ‘ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ–పౌర సమాజం పాత్ర’ అంశంపై ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సీసీఎస్ విధానం వద్దు అంటూ ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్న తరుణంలో...ఈ విద్యారంగాన్ని ఎలా కాపాడుకోగలమని ప్రశ్నించారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రమాణాలతో కూడిన విద్యాబోధన జరుగుతుండగా, ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందుకుభిన్నమైన పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. ఈ పరిస్థితి మార్చడానికి ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. ‘తెలంగాణ సాంస్కృతికోద్యమం–మహిళలు’ అంశంపై అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క మాట్లాడారు. ‘తెలంగాణ సాహిత్యోద్యమం–మహిళలు’ అంశంపై నల్గొండ మహత్మాగాంధీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనిత ప్రసంగించారు. టీపీటీఎఫ్ గజ్వేల్ జోన్ కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ విద్యా సదస్సులో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, అసోసియేట్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రం, నాయకులు పాల్గొన్నారు.