
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● సకాలంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
● వైద్యాధికారులకు కలెక్టర్ హైమావతి ఆదేశాలు
● తిమ్మాపూర్‌లో క్షేత్రస్థాయిలో పర్యటన
జగదేవ్‌పూర్(గజ్వేల్): సీజనల్ వ్యా ధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ.. తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి వైద్యాధికారులను ఆదేశించారు. ఆదివారం జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఇటీవల డెంగీతో మృతి చెందిన శ్రావణ్, మహేశ్‌ల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఫీవర్ సర్వేతో పాటు డెంగీ పరీక్షలు నిర్వహించాలని, ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే రక్తనమూనాలను టీహబ్‌కు పంపించి సమగ్ర వివరాలు తెలుసుకోవాలన్నారు. నీరు, చెత్తాచెదారం నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని, గ్రామాల్లో స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లకుండా ఎలాంటి లక్షణాలున్నా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామంలో అసాధారణ వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీ రమేశ్ క్లీనిక్‌ను సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేయాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఓ దేవకీదేవి, డీఎంహెచ్‌ఓ ధనరాజ్, ఎంపీడీఓ రాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.