
ఎరువుల ఇబ్బందులు ఉండొద్దు
అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: నియోజకవర్గ పరిధిలో రైతులెవరూ ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వ్యవసాయశాఖ అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయా మండలాల వారీగా యూరియా సరఫరా, ఇండెంట్ గురించి ఆరా తీశారు. నియోజకవర్గంలో రైతులు ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు నిర్లక్ష్యం వీడాలని సూచించారు. ఈ వానాకాలం సీజన్‌లో 11,600 మెట్రిక్ టన్నులకుగాను 4,772 మెట్రిక్ టన్నులే సరఫరా చేశారని మిగతా 6,878 మెట్రిక్ టన్నులను ఎప్పుడు సరఫరా చేస్తారని ప్రశ్నించారు. రైతులు యూరియా కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పంట నష్టం, రైతు బీమా అందించడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు.