
పర్యాటక కేంద్రంగా ఎల్లమ్మ చెరువు
జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలా అభివృద్ధి చేస్తాం యూరియా పంపిణీలో విజిలెన్స్ మానిటరింగ్ ఉండాలి మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హుస్నాబాద్ పట్టణంలో మంత్రి శనివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో జరుగుతున్న పెండింగ్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.15 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ...ఎల్లమ్మ చెరువులో చేపడుతున్న అక్రమ మట్టి తరలింపునకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఎల్లమ్మ సుందరీకరణ పనుల పురోగతి బతుకమ్మ, దసరాలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం మాదిరిగా ఎల్లమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. 250 పడకల ఆస్పత్రి పనులు ప్రారంభమయ్యాయని, అది పూర్తికాగానే పీజీ కళాశాల పనులను ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని, కాలువల నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు.
మూడు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి
యూరియా సరఫరాపై సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొన్నం ఫోన్‌లో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా యూరియాను అందించాలన్నారు. ఎరువుల పంపిణీలో ఎలాంటి లోపాలు చేసుకోకుండా విజిలెన్స్ మానిటరింగ్ చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో అధ్యక్షుడు బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఎల్లమ్మ దేవాలయ కార్యనిర్వహణ అధికారి కిషన్‌రావు తదితరులున్నారు.