
శాస్త్రవేత్తలుగా ఎదగాలి
● దేశస్థాయిలో వర్గల్ ఖ్యాతి ఇనుమడింపజేయాలి: ఎంపీ రఘునందన్ ● నవోదయలో ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం
విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి
వర్గల్(గజ్వేల్): భూనిర్వాసిత రైతులు సాగుచేసిన పొలాలకు వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. వర్గల్ ఫుడ్‌ప్రాసెసింగ్ జోన్‌లో భూములు కోల్పోయిన రైతులు శనివారం వర్గల్ మండలం అవుసులోనిపల్లి కెనాల్ వద్ద ఆయనను కలిసి న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలు అక్కడ ఏర్పాటు కాకపోవడంతో భూనిర్వాసిత రైతులు పంటలు సాగు చేసుకున్నారని, పంట సగంలో హఠాత్తుగా అర్ధరాత్రి అధికారులు విద్యుత్ సరఫరా కట్ చేయడం సరికాదన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ద్వారా పరిస్థితి వివరించారు. ముందే చెబితే రైతులు నాట్లు వేసేవారు కాదన్నారు. విద్యుత్ పునరుద్ధరణ చేయాలని కోరారు. విద్యుత్ పునరుద్ధరణ చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో రైతుల తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
వర్గల్(గజ్వేల్): శాస్త్ర సాంకేతిక రంగాలు అద్భుతంగా పురోగమిస్తున్న వేళ.. నవోదయ విద్యార్థులు దేశం గర్వించేస్థాయిలో శాస్త్రవేత్తలుగా ఎదగాలని, వర్గల్ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. శనివారం ఉమ్మడి మెదక్‌జిల్లాలోని వర్గల్ నవోదయ విద్యాలయంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమానికి ఆయన డీఆర్‌డీఓ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామచందర్‌రావుతో కలిసి హాజరయ్యారు. వారికి ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ ఆధ్వర్యంలో విద్యాలయ పరివారం, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం అంతరీక్ష రంగానికి సంబంధించి ఆర్యభట్ట నుంచి చంద్రయాన్, గగనయాన్ దాకా భారత పరిశోధనలు, విజయాలు సూచిస్తూ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమున్నత ఆశయంతో విద్యార్థులు ముందుకుసాగుతూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. భావిపౌరులుగా 2047 నాటికి దేశాన్ని అభివృద్ధిచెందిన దేశంగా మార్చాల్సిన భాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజేందర్ విద్యాలయలో అభివృద్ధి పనులు వివరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, నాయకులు కప్పర ప్రసాద్‌రావు, శ్రీనివాస్, గాడిపల్లి భాస్కర్, నందన్‌గౌడ్, రాంరెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.