
13న జాతీయ లోక్ అదాలత్
సిద్దిపేటకమాన్: సెప్టెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో క్రిమినల్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, మోటారు వాహన కేసులు రాజీపడేలా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. శనివారం జిల్లా కోర్టులో పోలీసు, రెవెన్యూ, ఎకై ్సజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సీపీ అనురాధ, న్యాయమూర్తులు జయప్రసాద్, మిలింద్ కాంబ్లి, సంతోష్‌కుమార్, సాధన, రేవతి, స్వాతిగౌడ్, జితేందర్, కాంతారావు, రాజశేఖర్‌రెడ్డి, పీపీ జీవన్‌రెడ్డి, అడిషనల్ పీపీ ఆత్మరాములు, ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐలు తదితరులు పాల్గొన్నారు.
కూడవెల్లి ఆలయం
అభివృద్ధికి కృషి
మంత్రి కొండా సురేఖ
దుబ్బాక: దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన కూడవెల్లి రామలింగేశ్వర ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం చైర్మన్ రాజిరెడ్డి మంత్రి సురేఖను కలిసి ఆలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. స్పందించిన ఆమె తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి సానుకూలంగా స్పందించడంతో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనంతుల శ్రీనివాస్, ఏసురెడ్డి, రవి, శ్రీరాం నరేందర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
శ్యాంసుందర్‌కు డాక్టరేట్
దుబ్బాక: దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్రం అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్యాంసుందర్‌కు హైదరాబాద్ గీతం డీమ్డ్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. శ్యాంసుందర్ సింథసిస్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ బెంజాక్సజోల్స్, థయాజొలిడిన్ డయోన్స్ అండ్ బయోలిజికల్ డాకింగ్ స్టడీస్‌పై చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. పర్యవేక్షకులు సుధాకర్ ఆధ్వర్యంలో శ్యాంసుందర్ చేసిన పరిశోధన ఫలితాలు రెండు అంతర్జాతీయ పరిశోధనా జర్నల్స్ లెటర్స్ ఆన్ ఆర్గానిక్ కెమిస్ట్రీతో పాటు రష్యన్ జర్నల్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రచురితమయ్యాయి. శ్యాంసుందర్‌కు డాక్టరేట్ రావడంపై ప్రిన్సిపాల్ భవాని అధ్యాపకులు అభినందించారు.
ఉత్తమ ప్రతిభకు పురస్కారం
సిద్దిపేట సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి అవార్డులు, రివార్డులు అందించనున్నట్లు సీపీ అనురాధ తెలిపారు. శనివారం సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో జూన్ నెలలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి సీపీ ప్రశంసా పత్రాలు అందజేశారు. చేర్యాల పట్టణంలోని చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళను కాపాడిన కానిస్టేబుల్‌ను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ మంది గంజాయి నేరస్తులను అరెస్టు చేసినందుకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో నుంచి నగదు పురస్కారం అందజేశామన్నారు. 32మందికి కేపీఐ రివార్డులు అందజేసినట్లు చెప్పారు. 11 మంది పోలీస్ అధికారులకు నగదు పురస్కారం అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్‌చంద్రబోస్, ఏసీపీలు రవీందర్‌రెడ్డి, నర్సింలు, అధికారులు పాల్గొన్నారు.

13న జాతీయ లోక్ అదాలత్

13న జాతీయ లోక్ అదాలత్