
అదే వరుస.. అదే ప్రయాస
ఉదయం నుంచే పడిగాపులు అధికారులను నిర్బంధించే యత్నం అడ్డుకున్న పోలీసులు
మిరుదొడ్డి(దుబ్బాక)/దుబ్బాకటౌన్/దౌల్తాబాద్(దుబ్బాక)/సిద్దిపేటకమాన్:/సిద్దిపేటఅర్బన్: యూరియా కొరత రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యూరియా వస్తుందని తెలిస్తే చాలు అన్నదాతలు అర్ధరాత్రే యూరియా కేంద్రాల వద్ద వాలిపోతున్నారు. పట్టా పాస్‌పుస్తకాలు, చెప్పులు క్యూ లైన్లో ఉంచి పడిగాపులు కాస్తున్నారు. అయినా ఒకటి, రెండు యూరియా బస్తాలు దొరకడమే గగనంగా మారిపోయింది. మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాల గ్రామానికి రెండు లారీల్లో 1,108 యూరియా బస్తాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రైతులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే క్యూ లైన్‌లో పడిగాపులు కాచారు. అధికారులు రెండేసి బస్తాలు పంపిణీ చేశారు. అయితే యూరియా దొరకని రైతులు ఆగ్రహించి రైతు వేదికలో ఉన్న వ్యవసాయ అధికారులను నిర్భంధించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా దౌల్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం ఉదయం నుంచే కాచుకొని కుర్చున్నారు. గంటల తరబడి లైన్‌లో ఉన్నా యూరియా దొరకడం కష్టంగా మారిందని రైతులు వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచకపోవడం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు శ్రీరామ్‌రెడ్డి వాపోయారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులు యూరియా కోసం క్యూ లైన్లు కట్టే పరిస్థితి వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు ఆరోపించారు. కార్మిక, కర్షక భవన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సరిపడా యూరియాను సరఫరాచేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు.
యూరియా కోసం రైతుల పాట్లు

అదే వరుస.. అదే ప్రయాస