
డిప్యుటేషన్లు రద్దు చేయండి
● డీఎంహెచ్‌కు కలెక్టర్ ఆదేశం ● చింతమడక పీహెచ్‌సీ తనిఖీ
సిద్దిపేటరూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ కె.హైమావతి అన్నారు. శనివారం మండల పరిధిలోని చింతమడక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రోగులకు అందించే వైద్యసేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్, ఓపి రిజిష్టర్‌ను తనిఖి చేశారు. వైద్యాధికారి భాస్కర్ 13వ తేదీ నుంచి రావడం లేదని అడగగా వర్గల్ మండలంలో డిప్యుటేషన్ ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. వెంటనే డీఎంహెచ్‌ఓతో మాట్లాడి రోజు 70 నుంచి 80 మంది వరకు ఓపి ఉండే ఆసుపత్రికి డాక్టర్‌ని డిప్యుటేషన్ ఇవ్వకూడదని, తప్పకుండా రెగ్యులర్ డాక్టర్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని డిప్యుటేషన్‌లను రద్దు చేయాలన్నారు. సీహెచ్‌ఓ లింగయ్య సెలవు మంజూరు కాకముందే సెలవు తీసుకున్నారని రిజిస్టర్ లో కలెక్టర్ కంప్‌లైంట్ రాశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడుతూ డాక్టర్లు వస్తారా అని ఆరా తీయగా డాక్టర్ అప్పుడప్పుడు వస్తారని, నర్సులు సేవలందరిస్తారని రోగులు కలెక్టర్‌కు తెలిపారు.
మట్టి గణపతులను పూజిద్దాం
వినాయక చవితి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కార్యాలయం ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, పర్యావరణ ఇంజనీర్ కుమార్ పాఠక, టి.రవీందర్, పర్యావరణ శాస్త్రవేత్త, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.