
పేదరికం పరిధులు దాటి..
సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించిన యువకుడు
తొగుట(దుబ్బాక): సంకల్ప బలముంటే విధి కూడా తలవంచుతుందని నిరూపించాడో నిరుపేద యువకుడు. మండల పరిధిలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన నర్మెట ఎల్లవ్వ, రాములు దంపతులు రెక్కల కష్టంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతుండేవారు. వీరికి మనోజ్ కుమార్ కుమా రుడు. ఎలాగోలా కష్టపడి మనోజ్ కుమార్‌ను డిగ్రీవరకు చదివించారు. ఇదేక్రమంలో తండ్రి రాములు మరణించాడు. దీంతో తన తల్లిని కష్టాల నుంచి గట్టెంక్కించాలన్న సంకల్పంతో కొన్నాళ్లు కేంద్ర ప్రభుత్వ విభాగంలోని సీఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్)లో కానిస్టేబుల్‌గా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విధులు నిర్వహించాడు. తను పనిచేస్తున్న విభాగంలో మరింత ఉన్నత ఎత్తుకు ఎదగాలనుకుని కానిస్టేబుల్‌గానే విధులు నిర్వర్తిస్తూనే సీఐఎస్‌ఎఫ్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సాధించాడు. హకీంపేటలో గత ఆరు నెలలుగా కఠినమైన ట్రైనింగ్‌ను పూర్తి చేసుకుని తన పాసింగ్ అవుట్ పరేడ్‌ను పూర్తి చేశాడు. ఉద్యోగం వచ్చిన ఆనందంతో తన తల్లి ఎల్లవ్వతో సంతోషాన్ని పంచుకున్నాడు. ఉద్యోగం సాధించుకున్న మనోజ్‌కుమార్‌ను అభినందిస్తూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.