
గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యం
● మంత్రి పొన్నం ప్రభాకర్
● ఘనంగా తీజ్ ఉత్సవాలు
హుస్నాబాద్: గిరిజనుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం పట్టణంలోని బంజారా భవన్‌లో తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహరాజ్‌కు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోధుమ మొలకల బుట్టను తలపై పెట్టుకొని బంజారా మహిళలతో కలిసి నృత్యం చేశారు. మంత్రి మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్, మేరీమా యాడి ఆశీర్వాదంతో పాడి పంటలు సమృద్ధిగా పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. 1978లో ఇందిరా గాంధీ గిరిజనుల అభ్యున్నతికి ఎస్టీ హోదాను కల్పించారని గుర్తు చేశారు. గిరిజనుల్లో అభివృద్ది చెందిన వారు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవారికి సహకారం చేసుకోవాలన్నారు. పేదవాళ్లకు అండగా నిలువాలని చెబితే దానిని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లలో ఏమీ చేయని వారు.. మరో మూడేళ్లల్లో వచ్చి చేస్తామని చెప్పడం వారి అవివేకమన్నారు. బంజారా భవనం నిర్మాణం కోసం రూ.45లక్షలు మంజూరు చేశామన్నారు. భవనం పూర్తి చేసే బాధ్యత నాదన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. బంజార భవన్‌లో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భూ సేకరణ
వేగవంతం చేయాలి
హుస్నాబాద్ ప్రాంతానికి సాధ్యమైనంత త్వరగా నీళ్లు అందించడానికి గౌరవెల్లి ప్రాజెక్టు భూ సేకరణ వేగిరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లెల్లగడ్డలో అర్బన్ డెవలప్‌మెంట్ పార్క్‌కు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలన్నారు. విద్యా సంస్థలకు, ఇతర భవనాలకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను సేకరించి ఉంచాలన్నారు. ఇంటి పన్నులు వంద శాతం వసూలు అయ్యేలా చూడాలన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలకు వినాయక విగ్రహాలు, మారేడు మొక్క, సంచి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.

గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యం