
పశువుల సంరక్షణ ముఖ్యం
● శాఖాపరమైన చర్యలు చేపట్టాలి
● అధికారులతో కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: జిల్లాలోని పశువుల సంరక్షణకు శాఖపరంగా అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖల అధికారులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పశువుల మేతకు కొరత లేకుండా చూడాలని, పశువిజ్ఞాన సదస్సులను నిర్వహించాలన్నారు. పశువులకు వ్యాధులు సంక్రమించకుండా ఎప్పటికప్పుడు సమీక్షించి వ్యాక్సినేషన్ అందించాలన్నారు. అన్ని పశువైద్యశాలల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వనమహోత్సవంలో భాగంగా ఇచ్చిన లక్ష్యాన్ని మించి మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారి పూర్ణచందర్, పశు వైద్య అధికారులు పాల్గొన్నారు.
ఉపాధికి ఐటీఐ కేంద్రాలు దోహదం
కొండపాక(గజ్వేల్): ఉద్యోగ, ఉపాధి కోసం ఐటీఐ కేంద్రాలు దోహదపడతాయని కలెక్టర్ హైమావతి అన్నారు. కుకునూరుపల్లిలో ప్రభుత్వ ఐటీఐ కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న బోధనలు, ప్రాక్టికల్స్ నిర్వహన తీరును తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అడ్వాన్స్ టెక్నాలజీతో అధునాతన మిషన్ల ద్వారా విద్యార్థులకు శిక్షణ నివ్వడం జరుగుతుందన్నారు. ఐటీఐ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రాంచంద్రాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.