
కొరత లేదు.. ఆందోళన వద్దు
● రైతులందరికీ యూరియా అందిస్తాం
● డీఏఓ స్వరూపరాణి
మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని, సకాలంలోనే అందరికీ అందిస్తామని డీఏఓ స్వరూపరాణి తెలిపారు. గురువారం మిరుదొడ్డిలోని పీసీసీఎస్ కేంద్రంతో పాటు, పలు ఎరువుల దుకాణాలను, చెప్యాలలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, స్టాక్‌లో ఉన్న ఎరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగస్టు నెల వరకు 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా.. నేటికి 25 వేల మెట్రిక్ టన్నులు వచ్చిందన్నారు. ఈ యేడాది సాగు పెరగడంతో యూరియా కొరత సమస్య తలెత్తిందన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి యూరియా సమస్య తీసుకెళ్లామన్నారు. వెంట వెంటనే యూరియాను ఆయా పండలాలకు సరఫరా చేస్తామని వెల్లడించారు. నానో యూరియా సైతం అందుబాటులో ఉందని తెలిపారు. వ్యవసాయ అధికారుల సూచనల ప్రకారం నానో యూరియాను పంటలకు వాడాలని సూచించారు. కాగా ఎరువుల దుకాణాలకు వచ్చిన యూరియాను రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే సరఫరా చేయాలని ఎరువుల దుకాణా డీలర్లను ఆదేశించినట్లు తెలిపారు.