
యూరియా.. నో స్టాక్
జిల్లాలో కొరత తీవ్రరూపం
● పలుచోట్ల బారులు తీరిన రైతులు ● పొంతనలేని కేటాయింపులే కారణం
గజ్వేల్: జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 4.47లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో వరి 2.86లక్షల ఎకరాల్లో సాగు అవుతోంది. ఇంకా నాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా వరి సాగు 3లక్షలపైచిలుకు ఎకరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఇకపోతే పత్తి 1.06లక్షల ఎకరాలు, మొక్కజొన్న 28502 ఎకరాలు, కంది మరో 6449ఎకరాల్లో సాగులోకి రాగా మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగులోకి వచ్చాయి. వర్షపాతం సక్రమంగా లేక నానా ఇబ్బందులు పడుతూ రైతులు సాగు చేసుకుంటున్న క్రమంలో యూరియా కొరత శాపంగా పరిణమించింది.
అరకొర కేటాయింపులే..
పొంతన కేటాయింపుల వల్లే యూరియా కొరత తీవ్రమవుతోంది. నిజానికి వానాకాలం సీజన్ ఆరంభం ఆగస్టు నెలాఖరు వరకు 31,939 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు సగం కేటాయింపులు మాత్రమే వచ్చాయి. దీంతో జిల్లాలో ఎక్కడా కూడా సరిపడా స్టాకు లేక రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రస్తుతం చాలా చోట్ల వరినాట్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. ముందుగా వేసిన వరి క్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న వరికి తప్పనిసరిగా యూరియా వేయాలి. యూరియా వాడకం పెరిగిన సమయంలో కొరత తలెత్తడం శాపంగా మారింది. ఈ క్రమంలోనే నో–స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. తాజాగా బుధవారం గజ్వేల్‌లోని సహకార కేంద్రం వద్ద అధికారులు నో–స్టాక్ బోర్డు వేయడంతో రైతులు ఆందోళనకు దిగారు.
యూరియా కొరత తీవ్రరూపం దాల్చింది. జిల్లా రైతాంగానికి కంటికి కునుకులేకుండా చేస్తోంది. ఎక్కడ చూసినా బారులు తీరిన రైతులే కనిపిస్తున్నారు. గంటల తరబడి నిరీక్షించినా చివరకు స్టాక్ లేదంటూ బోర్డులు పెడుతూ అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. తాజాగా బుధవారం ప్రధాన మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.
నిల్వలు తక్కువే..
వివిధ దేశాల్లో నెలకొన్న యుద్ధవాతావరణం కారణంగా దేశానికి రావాల్సిన యూరియా, ఇతర ఎరువులకు బ్రేక్ పడిందని చెబుతున్నారు. ఇకపోతే ప్రభుత్వానికి చెందిన ఆర్‌ఎఫ్‌సీఎల్(రామగుండం ఫర్జిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్), సీఐఎల్, ఎన్‌ఎఫ్‌ఎల్ ఇతర కంపెనీల నుంచి యూరియా నిల్వలు తక్కువగా వస్తున్నాయి. దీనివల్ల రైతులకు సరిపడా యూరియా దొరకడం కష్టసాధ్యంగానే మారింది. రాబోవు రోజుల్లో కొరత మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
ఇబ్బందులు తీరుస్తాం
యూరియా నిల్వలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే రైతుల ఇబ్బందులు తీరుస్తాం. సాధారణ యూరియా స్థానంలో నానో యూరియా వాడకంపై దృష్టి సారించాలి. ఆ దిశగా రైతులు ఆలోచించాలి.
– స్వరూపరాణి, జిల్లా వ్యవసాయాధికారి