
గోస ఎన్నాళ్లు..
దుబ్బాక: యూరియా కోసం రైతులు గంటల తరబడి నిరీక్షించారు. బుధవారం పట్టణంలో రెండు షాపులకు కలిసి 500 బస్తాల యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు ఆ దుకాణాల ఎదుట బారులు తీరారు. వేల సంఖ్యలో రైతులు వస్తే కేవలం కొద్దిమందికి మాత్రమే 2 బ్యాగుల చొప్పున పంపిణీ చేశారు. రోజు ఇలాగే లైన్‌లో నిల్చున్నా దొరకడం లేదంటూ చాలా మంది రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కోసం తిప్పలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఎన్ని రోజులు ఈ గోస పడాలని రైతులు ఈ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్క సంచి దొరకలే..
‘వారం నుంచి లైన్‌లో నిలబడుతున్నా.. ఒక్క సంచీ దొరకలేదు’ అని మహిళా రైతు లక్ష్మి వాపోయారు. నాట్లు వేసి నెల రోజులైందన్నారు. యూరియా దొరకకపోవడంతో పంట పరిస్థితి ఏందో అంటూ కన్నీరు పెట్టారు. త్వరగా అందేలా చూడాలంటూ వేడుకున్నారు.