రాయపోల్‌లో చిరుత కలకలం
దుబ్బాకటౌన్: రాయపోల్ మండలం వడ్డేపల్లిలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. వరుస దాడులతో గ్రామస్తులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల పొలాల వద్ద రెండు కుక్కలపై దాడి చేసి చంపడంతో ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 4 నెలల వ్యవధిలో చిరుత మూడు సార్లు కనిపించడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. రాత్రివేళల్లో, వేకువజామున పొలాలకు వెళ్లేందుకు రైతులు, కూలీలు జంకుతున్నారు. మరిన్ని దాడులు జరగకుండా చిరుతను బంధించాలని రైతులు కోరుతున్నారు.
ఆచూకి కోసం..
దుబ్బాక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో చిరుత పులి ఆచూకి కోసం అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చిరుత పులిని చూసిన రైతుల నుంచి వివరాలు సేకరించారు. కనబడిన ప్రదేశాన్ని పరిశీలించి పాద ముద్రలను పరిశీలించి చిరుత పులేనని నిర్ధారించారు. చిరుత పులి జాడ కోసం అడవిలో అనుమానిత ప్రదేశాల్లో అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో చిరుత కదలికలను సులభంగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
ఒకే చోట ఉండదు
చిరుత కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిరుత ఎప్పుడూ ఒకే చోట ఉండదు. రైతులు రాత్రి వేళ పొలాల వద్ద ఉండవద్దు. పశువులను సైతం ఇంటి వద్దే ఉంచాలి. పశువుల మేత కోసం ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దు. చిరుత కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
– సందీప్ కుమార్,
ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, దుబ్బాక
గ్రామ సమీప పొలాల్లో సంచారం
వరుస దాడులతో ప్రజల్లో భయాందోళన
జాడ కోసం చర్యలు ముమ్మరం
ట్రాప్ కెమెరాల ఏర్పాటు
అధికారుల సూచనలు
వ్యవసాయ పొలాలు అడవికి దగ్గరగా ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి.
పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వాలి.
పొలాల చుట్టూ విద్యుత్ కంచెను
ఏర్పాటు చేయవద్దు.
పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ అడవి దగ్గరగా ఉన్న పాలాల్లో ఒంటరిగా తిరుగవద్దు. రాత్రి వేళ రైతులు పొలాల వద్ద ఉండవద్దు.


