
రాజకీయంగా ఎదుర్కోలేకే కక్ష సాధింపు
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా ఎదుర్కోలేకే గాంధీ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, ఆరపల్లె జంక్షన్ల అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీబీఐ, ఈడీలపై ఆధారపడి బీజేపీ సర్కార్‌ను నడుపుతోందన్నారు. బీజేపీ బలహీనపడే సందర్భంలో పార్లమెంట్‌లో, బయట నరేంద్రమోడీ జవాబు చెప్పలేక కాంగ్రెస్ నాయకత్వాన్ని వేధింపులకు గురి చేస్తున్నార న్నారు. మిత్రపక్షాలు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా ఉండి, ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణి మంచి పద్ధతి కాదన్నారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు అభినందన..
హుస్నాబాద్‌రూరల్: గ్రామీణ క్రీడల్లో రాణించి హుస్నాబాద్‌కు పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.జిల్లా స్థాయి కబడ్డీ ట్రోఫీని గెలుపొందిన పోతారం(ఎస్) కృష్ణ కబడ్డీ క్లబ్ జట్టును గురువారం మంత్రి అభినందించారు. ఈ నెల 11, 12, 13న గజ్వేల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ట్రోఫీని పోతారం జట్టు గెలువడం హర్షణీయమన్నారు. గ్రామాల్లో క్రీడాకారులను తయారు చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించాలని కోచ్ కృష్ణకు సూచించారు.