పటాన్‌చెరు టౌన్: భవిష్య నిధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 27న ‘నిధి ఆప్కే నికత్ 2.0’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ రమేశ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:45 వరకు ఐదు కేంద్రాల్లో శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ గీత ఉన్నత పాఠశాల, దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి సాంకేతిక నిర్వహణ సంస్థ, కూకట్‌పల్లిలోని మున్సిపల్ కౌన్సిల్ (పురపాలక మండలి), నానక్‌రామ్‌గూడలోని ఎంఎస్ హిటాచీ డిజిటల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సిద్దిపేట రాజీవ్ రహదారి రోడ్డు మైత్రి వనం వికాస్ ఉన్నత పాఠశాలల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్య నిధి ఖాతాలు, పెన్షన్లు, ఇతర సేవలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ శిబిరాలకు హాజరై పరిష్కరించుకోవాలని సూచించారు.
పటాన్‌చెరు: అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడలో ఆదివారం మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. లక్ష్మీగణపతి సహిత కాశీ విశ్వేశ్వర పంచముఖి ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్: పట్టణంలో భువన్ సర్వేను మున్సిపల్ అధికారులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం సైతం పట్టణంలో సర్వే నిర్వహించారు. ఇదివరకే నిర్మించుకున్న నివాసాల చుట్టూ కొలతలు తీస్తున్నారు. రెండేళ్ల క్రితం సర్వే నిర్వహించి భువన్ యాప్‌లో అధికారులు నమోదు చేశారు. తిరిగి మళ్లీ సర్వే చేపట్టారు. నాటికి, నేటికీ ఇళ్ల నిర్మాణాల్లో వ్యత్యాసాలు ఉంటే ఈ సర్వే ద్వారా పన్నుల పెంపు చేపట్టనున్నారు. ఆయా భవనాల వారు ఎవైనా అదనపు నిర్మాణాలు చేపడితే అందుకనుగుణంగా పన్ను విధించనున్నారు.
చేర్యాల(సిద్దిపేట): విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూ నియన్ (టీజీయూఈఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలవాల స్వామి డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో లైన్‌మెన్, అసిస్టెంట్ లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్, ఆర్టిజన్ కార్మికులు తదితరులు యూనియన్‌లో చేరగా వారికి కండువాలు కప్పి సభ్యత్వం అందించారు. అనంతరం స్వామి మాట్లాడుతూ.. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. విద్యుత్ రంగం ప్రైవేటీకరణ వల్ల సామాన్య ప్రజలు, రైతులపై ఆర్థిక భారం పెరిగే ప్రమాదముందన్నారు. విద్యుత్ రంగాన్ని పరిరక్షించడంతోపాటు అందులో పనిచేసే కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేశారు.


