16 గొర్రెలు మృత్యువాత
దుబ్బాకటౌన్: దుబ్బాక మున్సిపల్ పరిధిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ధర్మాజీపేట వార్డులో ఓ నిరుపేద కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. వార్డుకు చెందిన నిరుపేద మహిళ లింగవ్వ కుటుంబం గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కలు గుంపుగా వచ్చి గొర్రెల మందపై విచక్షణారహితంగా దాడి చేశాయి. ఈ దాడిలో 16 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మరో 7 గొర్రెలు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకేసారి మందలో 16 గొర్రెలు మృతి చెందడంతో బాధితురాలు బోరున విలపించింది. గొర్రెల విలువ మార్కెట్లో సుమారు రూ. 2.7 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుందని, అధికారులు స్పందించి నష్ట పరిహారం అందించాలని బాధితురాలు కోరారు.


