జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్‌జోన్: పోలీస్స్టేషన్లలో రికార్డుల నిర్వహణలో క్రమపద్ధతి పాటించాలని, అలాగే స్టేషన్ల ఆవరణలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. దీంతో జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్‌ను శుభ్రం చేయడంతో పాటు, పోలీస్ స్టేషన్ల ఆవరణల్లో చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. అలాగే పోలీస్ స్టేషన్లలోని ఫైళ్లు, రికార్డులను క్రమపద్ధతిలో అమర్చుతూ 5ఎస్ విధానాన్ని అమలు చేశారు.
మనీషాపాటిల్కు
రాష్ట్ర స్థాయి బహుమతి
పాపన్నపేట(మెదక్): తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పాటల పోటీల్లో మండలంలోని ఆరెపల్లికి చెందిన దొడ్లె మనీషా పాటిల్‌కు రాష్ట్ర స్థాయిలో మూడో బహుమతి లభించింది. ప్రతిఏటా వీరు నిర్వహించే బతుకమ్మ పాటల పోటల్లో ఆమె దర్శకత్వం వహించి రచించిన ‘బుజ్జి బతుకమ్మ ’పాటకు మూడో బహుమతి లభించినట్లు ఆమె తెలిపారు. బతుకమ్మ సంప్రదాయాలు, సంస్కృతిని సమాజానికి చాటి చెప్పాలన్న లక్ష్యంతో పాట చిత్రీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. సర్పంచ్ రజిత, రాజశేఖర్, గ్రామస్తులు ఆమెను అభినందించారు.
పందిరి సాగుతో లాభాలు
తూప్రాన్: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు సాంప్రదాయ వరి పంటను పక్కనబెట్టి, పందిరి విధానంలో కూరగాయల సాగు చేపడితే అధిక లాభాలు ఆర్జించవచ్చని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ప్రతాప్‌సింగ్ సూచించారు. శనివారం మండలంలోని మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో పందిరి పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్న రైతుల తోటలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి లభ్యత తగ్గుతున్న తరుణంలో ఎక్కువ నీరు కావాల్సిన వరి పంటల జోలికి వెళ్లవద్దని హితవు పలికారు. తక్కువ నీటి వినియోగంతో నిరంతర ఆదాయాన్ని ఇచ్చే ఆరుతడి పంటలే ప్రస్తుత పరిస్థితుల్లో మేలైనవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పంజాల ఆంజనేయులుగౌడ్, ఉద్యానవన శాఖ మండల అధికారి రచన, ఉప సర్పంచ్ స్వామి, స్థానిక రైతులు పాల్గొన్నారు.
చెత్తకు నిప్పు..
పొగ పీలిస్తే రోగాలే..
రామచంద్రాపురం(పటాన్చెరు): చెత్తను తగలబెడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని విద్యుత్‌నగర్ కాలనీ శివారు ప్రాంతంలో పెద్ద ఎత్తున చెత్తను తగలబెడుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికలు ప్రశ్నిస్తున్నారు. కాలనీ నుంచి తెల్లాపూర్ వెళ్లే మార్గంలో రైల్వే అండర్‌పాస్ వద్ద పెద్ద ఎత్తున నిత్యం చెత్తను డంప్ చేసి తగలబెడుతున్నారు. దీంతో వచ్చే పొగతో అంబేడ్కర్ కాలనీవాసులతో పాటు గేటెడ్ కమ్యూ నిటీ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్తను తగులబెట్టకుండా సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


