ఫోన్‌పే స్పీకర్‌ పేరుతో బురిడీ | - | Sakshi
Sakshi News home page

ఫోన్‌పే స్పీకర్‌ పేరుతో బురిడీ

Oct 18 2026 7:45 AM | Updated on Oct 18 2026 7:45 AM

వ్యాపారి ఖాతా నుంచి రూ.28 వేలు మాయం

తూప్రాన్‌: ఫోన్‌పే స్పీకర్‌ సరిచేస్తానని నమ్మించి వ్యాపారి ఖాతా నుంచి నగదు కాజేసిన ఘటన స్థానికంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా.. కిరాణం షాపు నడుపుకునే ఆరే శేఖర్‌ వద్దకు శుక్రవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి, డిజిటల్‌ స్పీకర్‌ సమస్యను సరిచేస్తానని చెప్పి అతని ఫోన్‌ తీసుకున్నాడు. సాంకేతికత నెపంతో ఫోన్‌ పనిచేస్తున్నట్లు నటిస్తూ కాసేపట్లో రూ.28 వేలు తన ఖాతాకు బదిలీ చేసుకుని జారుకున్నాడు. సదరు వ్యక్తి వెళ్లిన తర్వాత మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ చూసి కంగుతిన్న బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు బాధితుడి ఖాతాను ఫ్రీజ్‌ చేయడంతో రూ.20 వేలు హోల్డ్‌ అయ్యాయి. అప్పటికే నిందితుడు రూ.8 వేలు విత్‌డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కాలకృత్యాలకు వెళ్లి..

చెరువులో శవమై..

వర్గల్‌(గజ్వేల్‌): కాలకృత్యాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లి కనపడకుండాపోయిన వృద్ధుడు శనివారం చెరువులో శవమై తేలాడు. ఈ విషాదకర ఘటన మండలంలోని మైలారంలో చోటు చేసుకుంది. గౌరారం ఎస్‌ఐ ఆరోగ్యం వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లింగ యాదగిరి(65) కొంత కాలం నుంచి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం సాయంత్రం కాలకృత్యాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తరువాత ఇంటికి రాలేదు. దీంతో భార్య యాదమ్మ, కుటుంబ సభ్యులు వెతుకుతుండగా శనివారం మధ్యాహ్నం గ్రామచెరువులో అతని మృతదేహం తేలింది. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయి మునిగి మృతిచెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నట్లు, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పుస్తెలతాడు చోరీకి యత్నం

నిందితుడిని పట్టుకున్న బాధితురాలు

బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గూడెం గ్రామ శివారులో శనివారం సినీ పక్కీలో చోరీకి యత్నం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గూడెం గ్రామానికి చెందిన మంజుల వ్యవసాయ పని ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై ఎదురుగా వచ్చిన దుండగుడు ఈరోడ్డు ఎటు పోతుందని మాటలు కలిపి ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు తెంపుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆమె అరుస్తూ ద్విచక్ర వాహనానికి అడ్డుగా నిలిచింది. నిందితుడి చేతిలో నుంచి పుస్తెలతాడును లాక్కుంది. అటు వైపుగా వస్తున్న వాహనదారులు, స్థానికులు అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సిద్దిపేట జిల్లా చింతమడకకు చెందిన సత్యనారాయణగా అతడ్ని గుర్తించారు. అతడితో పాటు మరెవరైనా ఉన్నారా? గతంలో ఎక్కడైనా చోరీకి పాల్పడి ఉంటాడా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement