కొండపాక(గజ్వేల్): ద్విచక్ర వాహనం పైనుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మర్పడ్గ శివారులో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మహమ్మద్ యూసుప్ షరీఫ్(48) ఆర్టీఏ ఏజెంట్గా పని చేస్తున్నాడు. దినచర్యలో భాగంగా శుక్రవారం పని చేయడానికి ద్విచక్ర వాహనం తీసుకొని ఇంటి నుంచి వెళ్లగా, భార్య షాహిన్ భేగం చేర్యాలలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది. పనులు ముగించుకొని వాహనంపై వస్తుండగా గ్రామ శివారులోని రహదారి ప్రక్కన ద్విచక్ర వాహనం పైనుంచి పడి మృతి చెందాడని శనివారం ఉదయం దూడెం కృష్ణ కటుంబీకులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ లక్ష్మిబాబు పేర్కొన్నారు.
స్కూటీని కారు ఢీకొట్టడంతో..
వర్గల్(గజ్వేల్): స్కూటీని కారు ఢీకొట్టడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి వర్గల్ శివారులోని అనంతకుంట కట్టపై జరిగింది. గౌరారం ఎస్ఐ ఆరోగ్యం వివరాల ప్రకారం.. శాకారం గ్రామానికి చెందిన తంగెళ్లపల్లి శ్రీనివాసచారి(51) వడ్రంగి. రాత్రి అతడు తన స్కూటీపై మెడోజి పెంటాచారితో కలిసి వర్గల్ వైపు వెళ్తుండగా అనంతకుంట కట్ట మీద ఎదురుగా వచ్చిన మారుతి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసచారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రాత్రి మృతి చెందాడు. పెంటాచారికి స్వల్పగాయాలయ్యాయి. కాగా మృతుడికి భార్య, పిల్లలున్నారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
హోటల్లో టిఫిన్ చేస్తూ..
రామాయంపేట(మెదక్): పట్టణంలోని హోటల్లో టిఫిన్ చేస్తున్న క్రమంలో వ్యక్తి కిందపడి మృతి చెందాడు. ఎస్ఐ బాల్రాజు వివరాల ప క్రారం.. నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామా నికి చెందిన వడ్ల సద్గుణాచారి(48) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఉదయం హోటల్లో టిఫిన్ చేస్తున్న క్రమంలో కిందపడిపోయి మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


