కొండపాక(గజ్వేల్): మండలంలోని దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణాలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా వరస పండుగల నేపథ్యంలో హైదరాబాద్ తదితర పట్టణాల నుంచి ప్రజలు గ్రామాల బాట పట్టారు. ఆదివారం సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలుమార్లు టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా క్యూ కట్టాయి. దీంతో టోల్ ప్లాజా నిర్వాహకులు హైదరాబాద్ నుంచి సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల, మంథని వైపునకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా నిర్వాహకులు తగు చర్యలు చేపట్టారు. నాలుగు వరుసలకు తోడుగా మరొక వరుసను తాత్కాలికంగా ఏర్పాటు చేసి ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా చూశారు.


