● 8 మంది రిమాండ్ ● చోరీ సొత్తు స్వాధీనం
మునిపల్లి(అందోల్): జల్సాలకు అలవాటై.. పలు చోట్ల కేబుల్ వైర్లను చోరీ చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. శనివారం బుదేరా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అరవింద్ కేసు వివరాలు వెల్లడించారు. టేక్మాల్ మండలం వెంకటాపూర్, సంఖ్యా తండాకు చెందిన 8 మంది నిందితులు రాత్రి కేబుల్ వైర్లను చోరీ చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి నిందితులు జోగిపేట మండలం, వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం, మునిపల్లి మండలంలోని పెద్దచెల్మెడ సోలార్ ప్లాంట్‌లో కేబుల్ వైర్లను కత్తిరించి చోరీ చేశారు. పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి గట్టుపై కాల్చగా వచ్చిన 125 కిలోల కాపర్ వైర్‌ను జిడిమెట్లలో స్క్రాప్ దుకాణంలో విక్రయించారు. కాపర్ వైర్ కిలోకు రూ.1,150 చొప్పున 125 కిలోలు అమ్మగా రూ.1,43,750 రాగా సమానంగా పంచుకున్నారు. పెద్దచల్మెడ సోలార్ ప్లాంట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశా రు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించామని పోలీసులు తెలిపారు. ఆటో యజమాని ప్రవీణ్‌ను ప్రశ్నించగా అదే గ్రామానికి చెందిన గోపాల్, ముఖేశ్‌తో పాటు మరో ఆరు మంది కలిసి చోరీ చేసినట్లు అంగీకరించారు. కొనుగోలు చేసిన ఎండి జిలానిపై కేసు నమోదు చేశారు. కాపర్ వైర్‌తో పాటు ఆటోను స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఏఎస్ఐ అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.


