బతుకమ్మ వేడుకల్లో దేవిగారి ఆనంద్ ప్రతిభ
దుబ్బాకటౌన్: దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామానికి చెందిన డప్పు కళాకారుడు దేవిగారి ఆనంద్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తెలుగు స్టూడెంట్ అసోసియేషన్, ఢిల్లీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో తెలంగాణ జానపద కళా వైభవాన్ని డప్పు దరువుతో చాటిచెప్పారు. దేవిగారి బాలయ్య, ఎల్లవ్వ దంపతుల పెద్ద కుమారుడు ఆనంద్..సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ చదువుతున్నారు. ఆయన డప్పు ప్రదర్శనను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, గాయని మంగ్లీ వీక్షించారు. తెలంగాణ సంస్కృతిని ఢిల్లీ వేదికపై ప్రదర్శించే అవకాశం మూడోసారి లభించడం ఆనందంగా ఉందని కళాకారులు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత అందె భాస్కర్, డప్పు దిలీప్కు ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు.


