అష్ట కాలభైరవ అడ్డా | - | Sakshi
Sakshi News home page

అష్ట కాలభైరవ అడ్డా

Jul 28 2026 7:14 AM | Updated on Jul 28 2026 7:14 AM

సిద్ధ సైన్యం తయారీ

బయ్యన్నగుట్ట..
చరిత్రకు ఆనవాళ్లుగా.. మహా కాలభైరవుడు

క్రీస్తు శకం 13వ శతాబ్దానికి చెందిన ప్రసన్న కాల భైరవుడు కొలువుదీరిన బయ్యన్న గుట్టలు చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. బయ్యన్న గుట్టలు, మహా సముద్రం గండిని సందర్శించి చరిత్రాత్మక నేపథ్యాన్ని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు రాజ్‌కుమార్‌ వివరించారు. – హుస్నాబాద్‌

హుస్నాబాద్‌ మండలం ఉమ్మాపూర్‌, నాగారం, మహ్మదాపూర్‌ గ్రామాలను ఆనుకొని ఉన్న గుట్టల వరుసకు చారిత్రక నేపథ్యం ఉంది. ఈ గుట్టల మధ్య మహా సముద్రం గండి, గండికి సమీపాన భైరవాద్రిపై బయ్యన్న ఖిల్లా ప్రసిద్ధి గాంచింది. నేల ఉపరితలం నుంచి మూడు కి.మీ దూరంలో రాళ్లు, జలపాతాల గుహలను దాటుకుంటూ, వన్య ప్రాణులు అరుపులు వినుకుంటూ వెళ్తే అపూర్వ రీతిలో చెక్కబడిన ప్రసన్న కాల భైరవ శిల్పం దర్శనమిస్తోంది. అష్ట భుజాలతో ఉన్న ఈ కాల భైరవుడి ముఖం రౌద్రంగా, త్రిభంగాసనంలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడ్డాడు. అంతరశిల్పంగా జ్వాలా కేశాలతో అభయ హస్తంతో త్రిపుర భైరవదేవి అలంకరించబడిన అరుదైన శిల్పం. కాకతీయ చక్రవర్తి, గణపతి దేవుడు, అతని అనంతరం రాణి రుద్రమదేవి ప్రతి యేట ఇక్కడ భైరవ ఆరాధక గురువు ఆధ్వర్యంలో రుద్రయామల తంత్రాన్ని నిర్వహించేవారని తెలుస్తోంది. సైన్యాధిపతులు, దండ నాయకులు, సమస్త యుద్ధ తంత్ర నిపుణులు, శత్రువులు విజయం సాధించాలనే తపనతో ఈ కార్యక్రమంలో పాల్గొనే వారని స్థానికుల కథనం.

అపూర్వ శిల్ప సంపద

ఇదే నేపథ్యంలో గుట్టలపై వెలసిన కాల భైరవుడిని సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ ఆరాధించేవాడని చరిత్ర చెబుతోంది. మహా సముద్రం గండిలోని 13వ శతాబ్దానికి చెందిన మహిషాసుర మర్దిని విగ్రహం ప్రస్తుతం ఈ గుట్ట సరిహద్దు గ్రామమైన మహ్మదాపూర్‌లో ఉంది. ఈ కాల భైరవుడి విగ్రహానికి చుట్టు పక్కల ఇదే కొండపై మరో భైరవ విగ్రహం, ఇంకో గండశిలపై హనుమంతుని రేఖా చిత్రం, గుట్ట పాదభాగంలో భైరవ చెట్టు కింద మెడ లోతులో కూరుకుపోయిన మరో భైరవ విగ్రహం ఉంది. అష్టదిక్కుల్లో అష్ట భైరవులు కాపలా కాస్తారని చరిత్ర చెబుతోంది. ఈ దుర్గమ ప్రదేశం చుట్టు పక్కల అనేక భైరవ విగ్రహాలు ఉండే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ మహా సముద్రం గండిలోని అమూల్య సంపద, వృక్ష, జంతు, సరీసృప సంపదలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు.

ర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ బలహీన వర్గాలను చేరదీసి సిద్ధ సైన్యాన్ని తయారు చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం (1680–1710) కాలంలో గోల్కొండ కుతుబ్‌షాహీ సుల్తానులు, మొఘలుల అధికారాన్ని గెరిల్లా పోరాటాలతో ధిక్కరించాడని తెలుస్తోంది. నవాబులచే నియమించబడిన నియంతృత్వ జమిందారులను, పాలకులను ఎదిరించి సామాన్య ప్రజలను ఆదుకున్నాడని జానపద కథనం. మొఘల్‌ సేనాని యూసఫ్‌ఖాన్‌ను ఎదిరిస్తూ హుస్నాబాద్‌ అటవీ ప్రాంతంలో ఈ మహా కాలభైరవుడు కొలువైన మహాసముద్రం గండిలోనే ఆయన అమరుడైనట్లు ఓ బుర్రకథ చెబుతుందని తన పరిశోధనలో వివరించారు.

మహాసముద్రం గండిలో అమూల్య శిల్ప సంపద

అద్భుతమైన గుట్టల ప్రాంతం చరిత్రాత్మకం

ప్రముఖ చరిత్ర పరిశోధకుడు రాజ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement