చిన్నశంకరంపేట(మెదక్): బైక్ కొనివ్వడం లేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నార్సింగి మండలం వల్లూర్ గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. నార్సింగి ఎస్‌ఐ సృజన కథనం ప్రకారం.. చేగుంట మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన మారబోయిన రమేశ్, యశోదల పెద్ద కుమారుడు శ్రీకాంత్(18) ఇంటర్ పూర్తిచేసుకుని వ్యవసాయ పనులు చేస్తున్నాడు. కొంత కాలంగా బైక్ కొనివ్వాలని తండ్రిని అడుగుతున్నాడు. శనివారం రాత్రి భోజనాలు చేసే సమయంలో తల్లిదండ్రులను బైక్ కొనివ్వాలని అడిగాడు. అయితే తండ్రి వర్షాకాలం పంటలు పండిన తరువాత కొనిస్తానని చెప్పాడు. ఆదివారం ఉదయం వల్లూర్ శివారులో ఉన్న పొలానికి నీరు పెట్టి వస్తానని చెప్పి వెళ్లిన శ్రీకాంత్ అక్కడి నుంచి తల్లికి ఫోన్‌చేసి తనకు బైక్ కొనివ్వడం లేదని, స్నేహితుల వద్ద పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫోన్ కట్ చేశాడు. వెంటనే తల్లి యశోద తన బావ కుమారుడిని తీసుకుని పొలం వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు ఉరివేసుకుని కన్పించాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కాలికి గాయం మానకపోవడంతో..
దుబ్బాకరూరల్: అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని కమ్మర్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కీర్తిరాజ్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వృద్ధుడు కొమ్మాట మల్లయ్య(70) కూలీ పని చేస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. కొంత కాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కాలికి గాయం కావడంతో అది మానడం లేదు. షుగర్ వ్యాధి ఎక్కువై పుండు మానకపోవడంతో అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వృద్ధుడు ఇంటి ప్రక్కన గల గదిలో ఆదివారం తెల్లవారు జామున ఉరివేసుకున్నాడు. ఉదయం కుటుంబీకులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


