● పేరుకుపోతున్న చెత్తాచెదారం
● ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు
● పట్టించుకోని అధికారులు
జహీరాబాద్: సహజత్వానికి విరుద్ధంగా ఎవరికి నచ్చినట్లు వారు వాగును మళ్లించుకుంటూ పోవడంతో వరదనీరు సక్రమంగా ముందుకెళ్లని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాగులో వచ్చే చెత్తాచెదారం పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తోంది. జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ, నారాయణనగర్ కాలనీల నుంచి ముసానగర్, చెన్నారెడ్డినగర్ కాలనీ, వసుంధర నగర్, ఇంద్రప్రస్థ కాలనీలో మీదుగా వెళ్తున్న వాగును ఇష్టానుసారంగా వెంచర్ నిర్వాహకులు దారి మళ్లించారు. దీంతో వరద నీరు ముందుకెళ్లడం లేదు. దీంతో ఎక్కడికక్కడ స్తంభించడంతో ఆయా కాలనీల వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. వసుంధర కాలనీ వెంచర్ నిర్మాణం కోసం నిబంధనలకు విరుద్ధంగా వాగును దారి మళ్లించారు. వాగుపై చిన్న చిన్న పైపులను వేసి పక్క కాలనీల నుంచి రాకపోకలు సాగించేందుకు వీలుగా చిన్న కల్వర్టును నిర్మించారు. కల్వర్టు నుంచి దిగువకు నీరు వెళ్లకుండా స్తంభిస్తోంది. కల్వర్టు వద్ద చెత్త పేరుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. భారీ వర్షం వస్తే కల్వర్టుకు ఇరువైపులా నీరు పొంగి కాలనీల్లోకి చేరుతోందని పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు వాపోతున్నారు.
చర్యలు తీసుకోవాలి..
దిగువన ఉన్న ఇంద్రప్రస్థ వెంచర్ వద్ద 65వ జాతీయ రహదారి పక్క నుంచి వాగును దారి మళ్లించారు. దీంతో వర్షం కురిస్తే వరదనీరు సక్రమంగా ముందుకెళ్లకుండా పరిసరాల్లో నిలుస్తోంది. దిగువన ఉన్న పలు వెంచర్లను సైతం నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేయడం, వాగును దారి మళ్లించడంతో వరదనీరు ఎక్కడికక్కడే స్తంభిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా మున్సిపల్, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వెంచర్లపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


