మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
సదాశివపేట(సంగారెడ్డి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎవరి విజయం కాదని విద్యార్థుల బాధ వారి ఆవేశాన్ని పరిగణలోకి తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శిశిర ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించిన కేన్సర్ స్క్రీనింగ్ క్యాంప్‌నకు హాజరై ఎంపీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ అయినా కేంద్రం బాధ్యత తీసుకుని, పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించి వెంటనే ఫలితాలు ప్రకటించిందన్నారు. కాగా ఆస్పత్రిలో అంబులెన్స్, ఆర్వోపాంట్లు,సోలార్‌ప్లేట్స్ పెట్టేందుకు నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోవూరి సంగమేశ్వర్, పట్టణ అధ్యక్షురాలు రాజేశ్వరి, మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు మాణిక్‌రావు, శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.
అట్టహాసంగా గ్రామోత్సవ క్రీడా వేడుకలు
మెదక్ కలెక్టరేట్: ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామోత్సవ క్రీడా వేడుకలు ఆదివారం మెదక్ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలను మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ త్రోబాల్ వేసి ప్రారంభించారు. ఈ పోటీల్లో 300లకుపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇషా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ క్రీడలతో యువతలో క్రీడాస్ఫూర్తి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సీఐ మహేశ్, జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి రమేశ్, పీఈటీలు నాగరాజు, వలంటీర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
హేమరాజ్‌సింగ్‌కు
వైద్యరత్న నేషనల్ అవార్డు
దుబ్బాక: వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు దుబ్బాక ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్‌సింగ్ వైద్యరత్న నేషనల్ అవార్డును అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో బహుజన సాహిత్య అకాడమి 19వ పశ్చిమ భారతదేశ సదస్సులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీఎస్‌ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ పాల్గొని హేమరాజ్‌సింగ్‌కు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఏ బాధ్యులు గుర్రాల శ్రీనివాస్, కుంబాల రవి, పెద్దముత్యం తదితరులు ఉన్నారు.
జిన్నారం(పటాన్‌చెరు): పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి గుమ్మడిదల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన రాజ్ ప్రసాద్(59) గుమ్మడిదల పట్టణ పరిధిలోని దోమడుగులో స్థిరపడ్డారు. కాగా జీఎస్‌బీ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజులాగే శనివారం విధులకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే తోటి కార్మికులు అతడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సూరారం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు పరిశ్రమ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి..
ములుగు(గజ్వేల్): ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని డబుల్‌బెడ్రూం సమీపంలోని రాజీవ్ రహదారిపై ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రఘుపతి కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిక్కునూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కాసెట్టి బాలమల్లు(45) ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్‌వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భార్య లక్ష్మి వద్దకు వెళ్తున్నాడు. మార్గమధ్యలో ములుగు సమీపంలోకి చేరుకోగానే అతను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.


