ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న చివరి బిల్లులకు కేంద్రం త్వరలోనే నిధులు అందజేయనుంది. బిల్లులు ఎప్పుడు మంజూరవుతాయోనని ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ ప్రకటన ఊరట నిచ్చింది. ఇప్పటివరకు జిల్లాలో పూర్తయిన 2,926 ఇళ్లకు రూ.31.11కోట్లను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)పథకం కింద లబ్ధిదారులకు వచ్చే నెలలోనే చెల్లించనున్నట్లు తెలుస్తోంది.
నారాయణఖేడ్
ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను నిర్మించుకుని చివరి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు త్వరలో చివరిబిల్లులు అందనున్నాయి. జిల్లాలో సుమారు రూ.35.11 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి కోసం నెలల తరబడి లబ్ధి దారులు ఎదురుచూస్తున్నారు. వీటిని త్వరలో చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారుల చివరి బిల్లులు ఈనెలాఖరులోగా చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ ప్రకటించారు. మంత్రి ప్రకటనతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని చివరి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు 2,926మంది ఉన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని రంగులు వేసి గృహప్రవేశాలు కూడా చాలామంది పూర్తి చేశారు. చివరి బిల్లును ఒక్కో లబ్ధిదారుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద చెల్లిస్తారు. ఒక్కో ఇందిరమ్మ లబ్ధిదారుకు రూ.5లక్షల వరకు చెల్లిస్తుండగా 25% రూ.1.20లక్షలు కేంద్రం వాటా కాగా రూ.3.80లక్షలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో చెల్లించగా కేంద్రం చివరి విడత బిల్లును ఇంటికి రంగులు వేసుకున్నాక అందజేస్తుంది.
2,926 మందికి రూ.31.11 కోట్లు పెండింగ్
విడుదల చేయనున్న కేంద్రం వాటా
రూ.35.11కోట్లు పెండింగ్
జిల్లాలో ఇందిరమ్మ పథకం కింద 16,559మందిని గుర్తించగా 15,833 మందికి కలెక్టర్ ఇళ్లను మంజూరు చేశారు. పథకం జూన్ 2025లో ప్రారంభం కాగా వీటిలో 2,926 ఇళ్లు పూర్తయ్యాయి. బేస్‌మెంట్ లెవల్ (బీఎల్ )స్థాయిలో 1,282 ఉండగా, రూఫ్ లెవల్ (ఆర్‌ఎల్)లో 717, రూఫ్ కాస్ట్ (ఆర్‌సీ) స్థాయిలో 2,671 ఇళ్లు ఉన్నాయి. పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.5లక్షలు చెల్లిస్తుండగా బీఎల్ స్థాయిలో రూ.లక్ష, ఆర్‌ఎల్ స్థాయిలో రూ.లక్ష, ఆర్సీస్థాయిలో రూ.1.80లక్షలు చెల్లిస్తారు. ఇళ్లు పూర్తి చేసుకుని రంగులు వేశాక చివరి బిల్లుగా రూ.1.20లక్షలు అందజేస్తారు. ఇలా చివరి బిల్లులు జిల్లాలో పూర్తయిన 2,926 ఇళ్లకు రూ.31,11,20,000లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెలలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు పూర్తి కానున్నాయి. ఇప్పటివరకు ఆయా స్థాయిలో పూర్తి చేసుకున్న ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.214.194 కోట్లను చెల్లించింది. ఇదిలా ఉండగా రెండో విడత ఇళ్ల నిర్మాణాలు సైతం జిల్లాలో వేగవంతానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతీ నియోజకవర్గానికి 2 వేల చొప్పన జిల్లాకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన సంగతి తెలిసిందే.


