రాజీతోనే రాజమార్గం | - | Sakshi
Sakshi News home page

రాజీతోనే రాజమార్గం

Jul 12 2026 6:52 AM | Updated on Jul 12 2026 6:52 AM

రాజీతోనే రాజమార్గం ప్రారంభమైన ఫార్మేషన్‌ రోడ్డు పనులు

జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర

సంగారెడ్డి టౌన్‌ : కేసులను రాజీమార్గంతో పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పేర్కొన్నారు. ఈ నెల 18న నిర్వహించే ప్రత్యేక లోక్‌అదాలత్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శనివారం ఓ ప్రకటనలో కోరారు. పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి అవకాశమున్న కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకోవడానికి న్యాయవాదులు, పోలీసులు సహకరించాలన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు.

తొలగనున్న ఇబ్బందులు

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): న్యాల్‌కల్‌లోని ప్రధాన రోడ్డు నుంచి ప్రభుత్వాస్పత్రి, పొలాలకు వెళ్లే రోడ్డు పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఫార్మేషన్‌ రోడ్డు పనులను స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రారంభించారు. న్యాల్‌కల్‌–బీదర్‌ వెళ్లే ప్రధాన రోడ్డు నుంచి పంట పొలాలు, ప్రభుత్వాస్పత్రి, బీసీ వసతిగృహానికి వెళ్లే దారి అధ్వానంగా మారడంతో అధికారులు, రోగులు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వర్షాకాలంలో వచ్చే వరదతో దారి అధ్వానంగా మారి ప్రజలు అవస్థలు పడేవారు. దారిని బాగు చేయాలని రైతులు, వైద్య సిబ్బంది స్థానిక పీఏసీఎస్‌ చైర్మన్‌ సిద్దిలింగయ్యస్వామి, సర్పంచ్‌ జ్యోతిలక్ష్మి, నాయకులు ప్రవీణ్‌ కుమార్‌, మండల అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో గ్రామసభ నిర్వహించి పంచాయతీ నిధుల నుంచి ఫార్మేషన్‌ రోడ్డు వేయించేందుకు నిర్ణయించిన సర్పంచ్‌ తదితరులు ఈమేరకు శనివారం పనులను ప్రారంభించారు. ఫార్మేషన్‌ రోడ్డు కోసం ఇరువైపులా జేసీబీతో కాల్వలు తీసే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. పనులు పూర్తయితే వైద్య సిబ్బంది, రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు దూరం కానున్నాయి.

ముమ్మరంగా ఓటర్ల నమోదు సర్వే

ఆర్డీఓ రమాదేవి

నిజాంపేట(మెదక్‌): మండలంలో ఓటర్ల నమోదు సర్వే ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా బీఎల్‌ఓలు సమర్థవంతంగా పని చేయాలని మెదక్‌ ఆర్డీఓ రమాదేవి సూచించారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న సర్వేను స్వయంగా పర్యవేక్షించారు. బీఎల్‌ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి దరఖాస్తు ఫారాలను స్వయంగా అందజేయాలని ఆదేశించారు. నందిగామ గ్రామంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే పత్రాలను తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పరిశీలించారు. సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని సిబ్బందికి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement