44 వేల ఎకరాల్లో సోయా..
విత్తు కోవడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో జిల్లా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: విత్తనాలు వేసుకోవడంలో సంగారెడ్డి జిల్లా రైతులు రాష్ట్రంలో ముందు వరుసలో ఉన్నారు. ఏ జిల్లాలో లేనివిధంగా ఇప్పటికే ఏకంగా 4.77 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు విత్తుకున్నారు. ప్రధానంగా 3.53 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ జిల్లాలో కూడా ఈ స్థాయిలో విత్తనాలు వేసుకోకపోవడం గమనార్హం. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణంలో సుమారు 65.11 శాతం విస్తీర్ణంలో విత్తుకున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. రెండో స్థానంలో ఆదిలాబాద్ జిల్లా ఉంది. ఇక్కడ 4.33 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు. వరి అత్యధికంగా సాగయ్యే జిల్లాల్లో ప్రస్తుతానికి సాగు విస్తీర్ణం తక్కువగా ఉంది. ఖరీఫ్ సీజనులో జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 7.33 లక్షల ఎకరాలు. గతేడాది ఇదే ఖరీఫ్ సీజనులో జూన్ నెలాఖరు వరకు 4.35 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు. అయితే గతేడాది కంటే సుమారు 42 వేల ఎకరాల్లో అదనంగా విత్తనాలు వేసుకున్నారు. ఇది జిల్లా సాధారణ సాగు విస్తీర్ణంలో సుమారు 65.11 శాతంగా వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సాధారణ విస్తీర్ణంలో సగటున 25% విత్తనాలు వేసుకోగా, సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నంగా ఏకంగా సాధారణ విస్తీర్ణంలో 65.11 శాతం ఇప్పటికే విత్తనాలు వేసుకోవడం గమనార్హం. ఈసారి ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలు తగ్గుతాయని హెచ్చరికలు చేసింది. ఈ హెచ్చరికలను సంగారెడ్డి జిల్లా రైతాంగం పెద్దగా పట్టించుకోలేదని విత్తనాలు వేసుకున్న విస్తీర్ణాన్ని బట్టి స్పష్టమవుతోంది.
సానుకూల వాతావరణమే కారణం
జూన్ నెలాఖరు నాటికి జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్ మాసంలో జిల్లా సాధారణ వర్షపాతం 126.3 మిల్లీమీటర్లు కాగా, 136.8 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డు అయింది. అంటే సుమారు ఎనిమిది శాతం అదనంగా వర్షం కురిసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నెలలో 13 రోజులు వర్షం కురిసింది. ఖరీఫ్ సీజను ప్రారంభమైన తొలి మాసంలో ఎల్‌నినో ప్రభావం జిల్లాలో కనిపించ లేదు. దీంతో రైతులు చకచక విత్తనాలు వేసుకున్నారు. చాలా చోట్ల పత్తి మొలకెత్తింది. కొన్ని చోట్ల రైతులు కలుపు తీయడాన్ని కూడా రైతులు ప్రారంభించారు. జిల్లాలో ఖరీఫ్ సీజను ప్రారంభం ఆశాజనకంగా ఉండగా ఈ జూలైతోపాటు రానున్న రోజుల్లో వర్షాలు ఏ మేరకు కురుస్తాయన్నది వేచి చూడాల్సిందే.
4.77 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసుకున్న అన్నదాతలు
జూన్ నెలాఖరుకే 65% విస్తీర్ణంలో పంటలు
రాష్ట్రంలో సగటున 25% దాటని విస్తీర్ణం
సీజన్ ప్రారంభంలో సానుకూల వర్షపాతమే కారణం
పత్తి తర్వాత జిల్లాలో అత్యధికంగా 44 వేల ఎకరాల్లో సోయాబీన్ విత్తనాలు వేసుకున్నారు. ఆ తర్వాత కంది 43 వేల ఎకరాల్లో విత్తుకున్నారు. పెసర ఆరు వేల ఎకరాలు, శనగ 4,223 ఎకరాలు, మిల్లెట్ పంటలు 3,100 ఎకరాలు, మొక్కజొన్న 2,600 ఎకరాల్లో విత్తుకున్నారు. మొత్తంగా ఆహార పంటలు సుమారు 57 వేల ఎకరాల్లో ఇప్పటికే విత్తనాలు వేసుకున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి.


