ఎల్‌నినో భయం
జిల్లాలో సాధారణమే
● ఇంకా సాగు దశలోనే రైతన్న
● జూలై 15 వరకు విత్తుకునే సమయం
● గుబులు రేపుతున్న ఎల్‌నినో భయం
● నాలుగు మండలాల్లో లోటు
● ఆరు మండలాల్లో అధికం
నారాయణఖేడ్: జిల్లాలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదైంది. కురవాల్సిన వర్షపాతం మేరకు వర్షం కురిసినట్లు రెవెన్యూ, వ్యవసాయ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా సంగారెడ్డి జిల్లాలోనూ లోటు వర్షపాతం ఉండే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు మొదట్లో ప్రకటించారు. కానీ జిల్లాలో జూన్‌లో సాధారణ వర్షపాతం 120.0 మి.మీ కాగా జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు 131.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో కల్హేర్, రాయికోడ్, కోహీర్, ఆందోల్ మండలాల్లో లోటు వర్షపాతం కురిసింది. సిర్గాపూర్, మనూరు, కొండాపూర్, సదాశివపేట్, ఆమీన్‌పూర్, ఆర్.సి పురం మండలాల్లో మాత్రం అత్యధిక వర్షపాతం నమోదైంది. మిగతా అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం ఉంది.
4.79 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో అన్ని పంటలు కలిపి ఇప్పటివరకు 4,79,571 ఎకరాల్లో పంటలు సాగు జరిగినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. ఇందులో ప్రధానంగా పత్తి 3,53,361 ఎకరాల్లో, మినుము 4,223 ఎకరాల్లో విత్తుకోగా వరి 463 ఎకరాలు, జొన్న 57 ఎకరాల్లోనే విత్తుకున్నారు. మృగశిర కార్తె జూన్ 8న ప్రారంభం అయ్యాక 15వ తేదీ నుంచి వానాకాలం పంటసాగు సీజన్ ప్రారంభం అవుతుండటంతో అప్పటినుంచి రైతులు విత్తనాలు విత్తుకుంటారు. ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉంటాయన్న భయంతో మృగశిర కార్తెకు ముందు రోజు తర్వాత కురిసిన వర్షాలకే కొందరు రైతులు విత్తనాలు విత్తుకున్నారు. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేశాయి. ఈ మధ్య వర్షాలు ఆడపా దడపా కురుస్తున్నాయి. జూలై 15 వరకు విత్తనాలు విత్తుకునేందుకు అదును ఉంది. కాగా, ఇంకా పలు పంటల్లో ముఖ్యంగా పప్పు దినుసులు, నూనె గింజలు, జొన్న, వరి నాట్లు జరనున్నాయి.
రానున్న రోజుల్లో నెలకొనే వర్షాభావ పరిస్థితులు రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. అనేక ప్రాంతాల్లో జూలైలో ఎండలు కొనసాగనున్నాయని, పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పొడి వాతావరణం నెలకొని అనేక ప్రాంతాల్లో వేసవి తరహా వేడి కొనసాగనుందని, పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో రానున్న రోజుల్లో మరింత తీవ్రతరం అవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్‌లో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అల్పపీడనాలు ఏర్పడక పోవడం వల్ల రుతుపవనాల విస్తరణ మందగమనం నెలకొని వర్షాభావం, వేడి తీవ్రత కొనసాగుతుందని వెల్లడించింది. ఇది వానాకాలం పంటలపై అధిక ప్రభావం చూపనుందని తెలిపింది. ఇదిలా ఉండగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.


