వైద్యుల సేవలు అమూల్యం | - | Sakshi
Sakshi News home page

వైద్యుల సేవలు అమూల్యం

Jul 2 2026 6:55 AM | Updated on Jul 2 2026 6:55 AM

వైద్యుల సేవలు అమూల్యం వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలి సహకార సేవలు సద్వినియోగం చేసుకోవాలి కొత్త పింఛన్ల మంజూరులో జాప్యం వద్దు

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌

సంగారెడ్డి: వైద్యుల సేవలు వెలకట్టలేనివని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ తెలిపారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం సంగారెడ్డి పట్టణంలోని గోకుల్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో డాక్టర్‌ శ్రీహరి ఆధ్వర్యంలో డాక్టర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి చింతా ప్రభాకర్‌ హాజరై వైద్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్లకు మెమెంటోలు అందజేసి డాక్టర్స్‌ డే శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజానికి వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వారి పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. అనారోగ్య సమయంలో ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమించే ప్రతీ వైద్యుడు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం వైద్యులు, ఆస్పత్రి సిబ్బందితో కలిసి డాక్టర్స్‌ డే కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో రెజింతల్‌ శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌, మధుసూదన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మసూద్‌, శ్రవణ్‌రెడ్డి, వాజిత్‌, విష్ణు, జలేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రైతు సంఘం

జిల్లా అధ్యక్షుడు జయరాజ్‌

సదాశివపేట రూరల్‌ (సంగారెడ్డి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వీబీజీ రామ్‌జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్‌ డిమాండ్‌ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సీఐటీయూ,వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని నందికంది తదితర గ్రామాల్లో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జయరాజ్‌ మాట్లాడుతూ...కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక గతంలో బడుగుబలహీన వర్గాలకు కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నీరుగార్చే విధంగా నిర్ణయాలను తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పథకంలో కేంద్రం 100శాతం నిధులను ఇచ్చేదని వీబీ జీరామ్‌ చట్టంలో 60% కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను మళ్లిస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌, నాయకులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సహకార అధికారి కిరణ్‌ కుమార్‌

ఝరాసంగం(జహీరాబాద్‌): సహకార సంఘాల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సహకార అధికారి కిరణ్‌ కుమార్‌ తెలిపారు. సహకార వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండల పరిధిలోని ఏడాకులపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వారోత్సవాల్లో సొసైటీ చైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సహకార సంఘాల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ కాంతమ్మ, డీసీసీబీ బ్రాంచ్‌ మేనేజర్‌ రాజు, సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

నవభారత్‌ నిర్మాణ్‌ యువసేన

అధ్యక్షుడుశ్రీధర్‌

పటాన్‌చెరు టౌన్‌: రాష్ట్రంలో కొత్త సామాజిక భద్రతా పింఛన్ల మంజూరులో జరుగుతున్న జాప్యంపై నవభారత్‌ నిర్మాణ్‌ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పటాన్‌చెరులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కొత్తగా అర్హత పొందిన వేలాదిమంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తులు, బడ్జెట్‌లో చేసిన ప్రకటనలు, మంత్రి ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలులోకి రాలేదని విమర్శించారు. రాబోయే మంత్రివర్గ సమావేశంలో పెండింగ్‌ లో ఉన్న అర్హుల దరఖాస్తులను పరిశీలించి, కొత్త పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement