మూడు నెలల గడువు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

మూడు నెలల గడువు ఇవ్వండి

Jul 2 2026 6:55 AM | Updated on Jul 2 2026 6:55 AM

చెత్త సమస్య పరిష్కారంపై కర్ణాటక రాష్ట్ర అధికారులు

అంగీకరించిన గ్రామస్తులు

తెలంగాణ అధికారులతో భేటీ

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): కర్ణాటక రాష్ట్రం బీదర్‌ నుంచి సరిహద్దు ప్రాంతం మీదుగా డంప్‌యార్డుకు తరలిస్తున్న చెత్త సమస్య పరిష్కారానికి మూడు నెలల సమయం ఇవ్వాలని ఆ రాష్ట్ర అధికారులు కోరారు. చెత్తను తరలించే వాహనాలను మల్గి గ్రామస్తులు అడ్డుకోవడంతో మంగళవారం బీదర్‌ మున్సిపాల్‌ సిబ్బంది చెత్తను రోడ్డుపై పారబోసిన విషయం తెలిసిందే. సాక్షిలో ప్రచురితరమైన ఈ కథానికి జిల్లా కలెక్టర్‌ స్పందించారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు బుధవారం రెవెన్యూ, పోలీస్‌ అధికారులు కర్ణాటక అధికారులతో మల్గి గ్రామంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. కర్ణాటక ప్రాంతం బీదర్‌కు చెందిన మున్సిపాల్‌ మేయర్‌ గౌస్‌, డిప్యూటీ కమిషనర్‌ సిద్దుగొండ తదితరులు హాజరు కాగా, రాష్ట్రం తరఫున న్యాల్‌కల్‌ తహసీల్దార్‌ ప్రభు, జహీరాబాద్‌ రూరల్‌ సీఐ హన్మంతు, ఎంపీడీఓ షగుప్తా ఇప్పత్‌, హద్నూర్‌ ఎస్‌ఐ దోమ సుజిత్‌ తదితరులు హాజరయ్యారు. మల్గి ప్రాంతం మీదుగా చెత్తను తరలించడం, డంప్‌ యార్డులో చెత్తను కాల్చడం వల్ల రోగాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రాంతం మీదుగా చెత్తను తరలించవద్దని కోరారు. సమస్య పరిష్కారం కోసం మూడు నెలలు గడువు ఇవ్వాలని బీదర్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ కోరారు. దోమలు వ్యాపించకుండా, కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామానికి వచ్చే రోడ్డును బాగు చేయించాలని గ్రామస్తులు కోరారు. అందుకు వారు అంగీకరించారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement