వైద్యాధికారులతో డీఎంహెచ్‌ఓ సమీక్ష
నారాయణఖేడ్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌ఓ) డా.లలితాదేవి స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని వైద్య సిబ్బందితో బుధవారం పీహెచ్‌సీల వారీగా నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ రోగులకు వైద్యసేవలు అందించడంలో ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదన్నారు. డాక్టర్స్ డే ఉత్సవాలను నిర్వహించారు. వైద్యాధికారులు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలను అందజేసి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. డీఐఓ డా.శశాంక్, డీటీసీఓలు నాగనిర్మల, అరుణకుమారి, ఎన్సీడీ దీప్తి, ఖేడ్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రవీణ్ కుమార్, డివిజన్ పరిధిలోని వైద్యాధికారులు పాల్గొన్నారు. ఖేడ్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్, తుర్కాపల్లి, సిర్గాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను డీఎంహెచ్‌ఓ లలితాదేవి ఆకస్మికంగా తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. మందుల నిల్వలు, రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
ఆరోగ్య ఉపకేంద్రం తనిఖీ..
కల్హేర్(నారాయణఖేడ్): కల్హేర్, సిర్గాపూర్‌లో ఆస్పత్రులు, సుల్తానాబాద్‌లో ఆరోగ్య ఉపకేంద్రం తనిఖీ చేసి సిబ్బంది హాజరు శాతం, రికార్డులు పరిశీలించారు. రోగులకు వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. సిర్గాపూర్ పీహెచ్‌సీలో డాక్టర్‌ను నియమించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ జెబ షహమిమ్, సిబ్బంది రాంచందర్, కృష్ణవేణి, జెట్ల భాస్కర్ పాల్గొన్నారు.


