బీఎస్సీ(ఆనర్స్‌) ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు | - | Sakshi
Sakshi News home page

బీఎస్సీ(ఆనర్స్‌) ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు

Jul 2 2026 6:55 AM | Updated on Jul 2 2026 6:55 AM

ములుగు(గజ్వేల్‌): మండలంలోని అటవీ కళాశాల పరిశోధన సంస్థలో 2026–27 విద్యాసంవత్సరానికి నాలుగేళ్ల బీఎస్సీ(ఆనర్స్‌) ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల డీన్‌ ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 25 వరకు కొనసాగుతుందని, ఇంటర్మీడియెట్‌ లేదా దానికి సమానమైన పరీక్షలో బైపీసీ, ఎంబైపీసీ, ఎంపీసీ గ్రూపులతో ఉత్తీర్ణత సాధించి, టీజీ ఈఏపీసెట్‌–2026లో అర్హత పొందిన విద్యార్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. వివరాలకు www.fcrihyd.in వెబ్‌సైట్‌ లేదా 63038 27110, 08454–211939, 08454–211930 నంబర్లను సంప్రదించాలని లేదా fcriadmirrionr@fmai.comకు ఈ–మెయిల్‌ చేయాలని సూచించారు.

42 పోస్టులకు దరఖాస్తులు

సంగారెడ్డి క్రైమ్‌: ఉమ్మడి జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల, కళాశాలలో టీచర్లను కాంట్రాక్ట్‌ ప్రాతిపాదికన దరఖాస్తులను ఈనెల 3వ తేదీన స్వీకరిస్తున్నట్లు ఉమ్మడి మెదక్‌ గురుకుల ఇన్‌చార్జి రాజేశం ఒక ప్రకటనలో తెలిపారు. మెత్తం 42 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ, బీఎడ్‌ , పీజీ చదివి ఉండి, కనీసం 55శాతం మార్కులు విద్యార్హతగా నిర్ణయించారు. ఆసక్తి గల వారు శుక్రవారం ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్లు, ఆధార్‌, ధ్రువపత్రాలతో ముత్తంగిలోని ఆర్‌ఆర్‌ఎస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలోని కార్యాలయానికి రావాలని సూచించారు.

మెరుగైన పీఆర్సీకి కృషి

నర్సాపూర్‌: ఉపాధ్యాయులకు మెరుగైన పీఆ ర్సీ ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యా యుడు వీరేశం ఉద్యోగ విరమణ సమావేశానికి ఎమ్మెల్సీ ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. సీపీఎస్‌ రద్దు కోసం కృషి చేస్తున్నామని, పెండింగ్‌ బిల్లులు మంజూరు చేయిస్తామన్నారు. త్వరలోనే బదిలీలు, పదో న్నతుల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి మహేందర్‌రెడ్డి, హెడ్మాష్టర్‌ సామ్యానాయక్‌, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, ఎంఈఓలు తారాసింగ్‌, బుచ్చానాయక్‌, యూనియన్‌ నాయకులు శ్రీనివాస్‌, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

పెళ్లి పేరుతో మోసం..

యువకుడి అరెస్ట్‌

జిన్నారం (పటాన్‌చెరు): పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళ నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన యువకుడిని ఐడీఏ బొల్లారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ రవీందర్‌ రెడ్డి వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌ కాకినాడ సాలిపేటకు చెందిన శ్రీనివాస్‌ (25) జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నాడు. బాధిత మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అద్దె గదిలో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ మహిళ నుంచి డబ్బులు తీసుకున్నాడు. కాగా ఆమె పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. దీంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

ఎరువుల వ్యాపారి

రిమాండ్‌

చేర్యాల(సిద్దిపేట): యూరియా అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడిన వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రమేశ్‌ కథనం ప్రకారం... గత నెల 9వ తేదీన వ్యవసాయ అధికారులు జరిపిన తనిఖీల్లో 6,429 యూరియా బస్తాలకు తప్పుడు బిల్లులు సృష్టించి అమ్మినట్లు తేలింది. దీనికి బాధ్యులైన నలుగురు యూరియా డీలర్లపై ఏడీఏ రాధిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కాగా వారిలో స్థానిక ఫర్టిలైజర్స్‌ యజమాని సందీప్‌రెడ్డిని బుధవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement