లారీ ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Jul 2 2026 6:55 AM | Updated on Jul 2 2026 6:55 AM

సిద్దిపేటఅర్బన్‌: లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన రంగధాంపల్లి చౌరస్తా వద్ద బుధవారం చోటు చేసుకుంది. త్రీటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం... చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లికి చెందిన అందె మహిపాల్‌రెడ్డి(47) సిద్దిపేట పాత బస్టాండ్‌ సమీపంలోని ఓ భవన్‌లో పార్కింగ్‌ సెంటర్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని తన బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రంగధాంపల్లి చౌరస్తా వద్ద రోడ్డు దాటే సమయంలో వాహనాలు ఎక్కువగా రావడంతో పక్కకు ఆగాడు. వెనక నుంచి వచ్చిన లారీ ఓవర్‌ టేక్‌ చేస్తున్న క్రమంలో వెనక టైర్‌ తగలడంతో కిందపడిపోయాడు. అలాగే అతని పైనుంచి లారీ వెళ్లడమే కాక కొంత దూరం లాక్కెళ్లడంతో కాలు, చేయి నుజ్జు నుజ్జై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌ రాజలింగంపై కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడంతో పాటు అతి వేగంగా వచ్చి ఢీకొట్టినట్టు విచారణలో గుర్తించినట్టు పేర్కొన్నారు.

అల్పాహారం కోసం వెళ్తూ..

సిద్దిపేటఅర్బన్‌: బైక్‌ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాల శివారులో రాజీవ్‌ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. త్రీటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కుంభోజి శివకుమార్‌(50) కేబుల్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. రాజీవ్‌ రహదారి పక్కన హోటల్‌లో టిఫిన్‌ చేసేందుకు కిరీట్‌తో కలిసి స్కూటీపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో రహదారి దాటుతున్న సమయంలో బక్రిచెప్యాల నుంచి సిద్దిపేట వైపు వస్తున్న బైక్‌ వీరిని ఢీకొట్టింది. దీంతో స్కూటీ నడుపుతున్న శివకుమార్‌ కొంత దూరం బైక్‌తో సహా ముందుకు వెళ్లి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్టు తెలిపారు. కిరీట్‌ ఎగిరి కిందపడగా చేతికి స్వల్పగాయాలయ్యాయి. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు బైక్‌ నడిపిన నందకిశోర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడు..

రాయికోడ్‌(అందోల్‌): అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని చెర్ల రాయిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన యూ.రజిత్‌(25) ఉదయం పొలం పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. పక్కింటి ఉండేవారు పనుండి రజిత్‌ ఇంటికి వెళ్లగా దూలానికి ఉరివేసుకుని కన్పించాడు. దీంతో కుటుంబీకులకు సమాచారం అందించారు. జహీరాబాద్‌ డీఎస్పీ సైదా, రూరల్‌ సీఐ హన్మంతు, ఎస్‌ఐ చైతన్యకిరణ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో కారం పొడి చల్లి ఉండటం, రజిత్‌ నోట్లో బట్ట ఉండటంతో కుటుంబీకులు మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు డాగ్‌ స్వ్డా్‌, క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రజిత్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేసి దూలానికి వేలాడదీశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement