ప్రజాప్రతినిధుల పట్టు | - | Sakshi
Sakshi News home page

ప్రజాప్రతినిధుల పట్టు

Mar 12 2026 9:11 AM | Updated on Mar 12 2026 9:11 AM

పోటాపోటీగా పనుల జాబితాలతో ప్రతిపాదనలు ఎవరివి పరిగణలోకి తీసుకోవాలని అధికారుల తర్జనభర్జన రూ.41.99 కోట్ల ఉపాధిహామీ నిధుల వ్యవహారం

ప్రజాప్రతినిధుల వాదనలిలా..

గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన నిధుల విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికరమైన పోరు కొనసాగుతోంది. జిల్లాకు మంజూరైన రూ.41.99 కోట్ల నిధులతో చేపట్టనున్న ఈ పనులను తామే నిర్ణయిస్తామని ఇరుపార్టీల ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో పాటు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు కూడా పోటాపోటీగా పనుల ప్రతిపాదనల జాబితాలను పంపుతున్నారు. దీంతో ఎవరి ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి

పాధిహామీ పథకంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద జిల్లాకు రూ.52.62 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామపంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, పాఠశాలల్లో టాయిలెట్లు, మహిళా సంఘాల భవనాలు, కల్వర్టులు నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు రూ.10.63 కోట్లు ఖర్చయ్యాయి. మిగిలిన రూ.41.99 కోట్లకు సంబంధించిన నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని భావిస్తున్నారు. అయితే ఈ నిధుల విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తాము సూచించిన పనులనే చేయాలని ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు. ప్రజల చేత ఎన్నుకున్న తామే ఈ పనులను ప్రతిపాదిస్తామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు.

ఎవరెవరు

ఎన్ని రూ.కోట్ల పనులంటే..

ఆయా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు రూ.రెండు కోట్లు, కాంగ్రెస్‌ నేతలకు కూడా రూ.2 కోట్ల నిధుల చొప్పున పనులు కేటాయించాలనే నిర్ణయానికి అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా సంగారెడ్డి నియోజకవర్గంలో చింత ప్రభాకర్‌ రూ.2 కోట్ల అంచనా వ్యయం కలిగిన సీసీ రోడ్లు పనులను ప్రతిపాదిస్తే..టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి కూడా రూ.2 కోట్ల పనులను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. జహీరాబాద్‌ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మాణిక్‌రావుతోపాటు, సెట్విన్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ గిరిధర్‌రెడ్డి చెరో రూ.2 కోట్ల మేరకు సీసీ రోడ్ల పనులు ప్రతిపాదించారు. జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ కూడా ఈ పనుల జాబితాలను పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీకి చెందిన ఎంపీ రఘునందన్‌రావుతోపాటు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి కూడా చెరో రూ.2 కోట్ల మేరకు సీసీ రోడ్ల పనులను ప్రాతిపాదించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

సీసీ రోడ్ల నిధుల కోసం కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ పరిశీలన

ఆయా ప్రజాప్రతినిధులు పంపిన ప్రతిపాదనలు కలెక్టర్‌ ప్రావీణ్య నేతృత్వంలోని జిల్లా కమిటీ పరిశీలిస్తోంది. డీఆర్‌డీఏ పీడీ జ్యోతి, పంచాయతీరాజ్‌ ఈఈ యుగంధర్‌, డీపీఓ జానకిరెడ్డి తదితరులు సభ్యులుగా ఉన్న కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి రెండు రోజుల్లో పనులను మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్‌లు జారీ చేయనున్నారు.

సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యేలు, నేతలు తమ అనుచరుల కోసం ప్రతిపాదిస్తుంటారు. సుమారు రూ.ఐదు లక్షల నుంచి రూ.10లక్షల వరకు అంచనా వ్యయం కలిగిన ఈ పనులను తమ అనుచరులకు ఇప్పించుకోవడం పరిపాటి. అయితే ఈ నిధుల విషయంలో మూడు పార్టీల ప్రజాప్రతినిధులు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. అధికారంలో ఉన్న తామే ఈ పనులను ప్రతిపాదిస్తామని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు అంటుంటే..తమకే ఈ పనులను ప్రతిపాదించే అధికారం ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ఈ నిధులు కేంద్రం నుంచి వచ్చాయని తమ ప్రతిపాదనలకే ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ ప్రజాప్రతినిధులు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ పనుల విషయంలో మూడు పార్టీల నేతలు పట్టుబడుతుండటంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement