పట్టించుకోని రెవెన్యూ అధికారులు సర్కారు భూముల్లో జోరుగా అక్రమ నిర్మాణాలు అయోమయంగా 181 సర్వే నంబర్ భూముల దుస్థితి కనీసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయని వైనం
జిన్నారం (పటాన్‌చెరు): ప్రభుత్వ భూములు దర్జాగా అన్యాక్రాంతానికి గురవుతున్నా, అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రింగ్‌రోడ్డు సమీపంలోని కోట్ల విలువైన భూములు దురాక్రమణకు గురవుతున్నా అధికార యంత్రాంగంలో ఎలాంటి చలనం లేదు. గడ్డపోతారం పట్టణ పరిధిలోని కాజీపల్లి గ్రామ శివారు శంబిపూర్ సమీపంలోని 181 సర్వే నంబర్లు దాదాపు 3 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతోందని పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీస చర్యలు లేవని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఫైర్ స్టేషన్ నిర్మాణం ఎప్పుడో!
సర్వేనంబర్ 181లోని ప్రభుత్వ భూముల్లో పారిశ్రామిక యాజమాన్యాలు ప్రజాప్రతినిధుల సూచన మేరకు ఫైర్‌స్టేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవా లని గతంలో కోరారు. ఫైర్ స్టేషన్ నిర్మాణం కోసం రెవెన్యూ యంత్రాంగం స్థానిక నాయకులతో కలిసి స్థల పరిశీలన కూడా పూర్తి చేశారు. కానీ నేటికీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కాలేదు.జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసు కోవాలని స్థానికులు కోరుతున్నారు. లేనిపక్షంలో దర్జాగా ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆందోళన పడుతున్నారు.
బోర్డు ఏర్పాటులో అలసత్వం
కాజిపల్లి శివారులోని సర్వే నంబర్ 181 భూములు దర్జాగా పలుమార్లు ఆక్రమణకు గురై నిర్మాణాలు జరుగుతున్నాయని పలుమార్లు రెవెన్యూ అధికారికి స్థానికులు ఫిర్యాదులు చేశారు. నామమాత్రంగా తనిఖీలు చేసి ఊరుకున్నారే తప్ప అక్రమార్కులపై సరైన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఆ స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామని రెవెన్యూ అధికారులు మాటల్లో చెప్పడమే తప్ప ఇంతవరకు అమలు చేయలేదు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడి హెచ్చరిక బోర్డు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.


