● కేసీఆర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఎవరూ గుంజుకోలేరు ● మాజీమంత్రి హరీశ్‌రావు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కన్నులు భూములపైనే తప్ప ప్రజా సమస్యలపై లేవని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్‌రావు విమర్శించారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు కేసీఆర్‌నగర్ కాలనీలో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు, మహిళ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూములను అమ్మడం, పేదోళ్ల ఇళ్లు కూల్చడం తప్ప మంచిపనులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ పేరిట పేదోళ్ల ఇళ్లను, ఖమ్మంలో సైతం వందలాదిమంది ఇళ్లను రేవంత్ సర్కార్ కూల్చి వేసిందని చివరికి ఆలయాలను సైతం కూల్చడానికి సిద్ధమైందని మండిపడ్డారు. పేదోళ్ల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. పేదల వద్ద ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఇళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తు చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఇళ్లను గుంజుకోవడం ఎవరి తరమూకాదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలని హరీశ్‌రావు కోరారు. గల్ఫ్‌లో యుద్ధం కారణంగా ప్రపంచమంతా ఆందోళనలో ఉందన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో యుద్ధం ముగిసిపోవాలని అల్లాను వేడుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


