రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తి చేస్తాం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని అంబేడ్కర్ కాలనీ వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జిని త్వరలోనే పూర్తి చేస్తామని ఎంపీ రఘునందన్‌రావు స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నానని పేర్కొన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కావలసిన స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం విద్యుత్‌నగర్‌లో కాలనీవాసులతో కలసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్నికల ప్రచార సమయంలో ఇక్కడి ప్రజలు అనేక సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. విద్యుత్‌నగర్ నుంచి తెల్లాపూర్ వెళ్లే మార్గంలోని రైల్వే అండర్ బ్రిడ్జి ఇరుకుగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడటం స్వయంగా చూసినట్లు చెప్పారు. ఈ సమస్యను రైల్వే అధికారులు, కేంద్ర రైల్వేశాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయిన వెంటనే ఆయన అండర్ బ్రిడ్జి మంజూరు చేసినట్లు తెలిపారు. అండర్ బ్రిడ్జి నిర్మాణం, ఆ ప్రాంతంలో రోడ్డు వెడల్పు కోసం క్షేత్రస్థాయిలో పర్యటించి స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. ఆదే విధంగా విద్యుత్‌నగర్ కాలనీ, ఆర్‌ఆర్–7 రోడ్డు కనెక్టివిటీ కోసం తెల్లాపూర్ రైల్వే స్టేషన్ వద్ద ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, తెల్లాపూర్ నుంచి ఈదులనాగులపల్లి వరకు ఎంఎంటీఎస్ రైలు పొడిగించేందుకు ఇప్పటికే పలుమార్లు రైల్వే ఉన్నతాధికారులతో చర్చించినట్లు వివరించారు. దీంతోపాటు రామచంద్రాపురం జాతీయరహదారి నుంచి ఈఎస్‌ఐ ఆస్పత్రి మీదుగా విద్యుత్‌నగర్ కాలనీ వెనుక నుంచి తెల్లాపూర్ ఆర్‌ఆర్–7వరకు రోడ్డు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై జీహెచ్‌ఎంసీ, రైల్వే అధికారులతో మాట్లాడుతున్నట్లు వివరించారు. అదేవిధంగా విద్యుత్‌నగర్‌లోని త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా దిశ కమిటీ సభ్యులు కాసాల సుధాకర్, జిల్లా కిసాన్‌మోర్చా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రాంబాబు గౌడ్, మాజీ కౌన్సిలర్లు లచ్చిరాంనాయక్, బాలాజీ, రాజు, నాయకులు నరసింహారెడ్డి, నరేందర్‌రెడ్డి, మురళి, సంతోశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు
రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తి చేస్తాం


