జోరుగా చెరుకు సాగు | - | Sakshi
Sakshi News home page

జోరుగా చెరుకు సాగు

Feb 25 2026 11:36 AM | Updated on Feb 25 2026 11:36 AM

జోరుగా చెరుకు సాగు

జోరుగా చెరుకు సాగు

జహీరాబాద్‌ టౌన్‌: ఖరీఫ్‌ పంటలతో నష్టాలు చవిచూసిన రైతులు ప్రస్తుతం చెరుకు పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఎకరం తోట ఉన్న రైతు మరో ఎకరం అదనంగా సాగు చేస్తున్నారు. ఇలా రైతులు చెరుకు పంట విస్తీర్ణం పెంచుకుంటుపోతున్నారు. భారీ వర్షాల కారణంగా ఖరీఫ్‌ పంటలైన పత్తి, పెసర, కంది తదితర పంటలతోపాటు వాణిజ్య పంటలైన అల్లం, ఆలుగడ్డ, అరటి తదితర పంటలు దెబ్బతిన్నాయి. మద్దతుధర కూడా లేక పెట్టుబడి రాక నష్టపోయారు. దీంతో ఆదుకుంటుందన్న నమ్మకంతో రైతులు చెరుకు పంట సాగుపట్ల మొగ్గు చూపుతున్నారు.

ఈ ఏడాది 40 వేల ఎకరాల్లో..

జిల్లాలో గతేడాది సుమారు 35 వేల ఎకరాల్లో రైతులు చెరుకు పంటను సాగు చేశారు. ఈ సంవత్సరం సుమారు 40 వేల ఎకరాల్లో పంట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 36 వేల ఎకరాల్లో పంట వేసినట్లు తెలుస్తోంది. జూన్‌ నెలాఖరు వరకు ప్లాంటేషన్‌ కొనసాగుతుందని, సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఫ్రీజోన్‌ ఏర్పాటుతో..

జహీరాబాద్‌ ప్రాంత నేలలు చెరుకు, అల్లం, ఆలుతోపాటు కంది, సోయాబిన్‌, పత్తి, పెసర, మొక్కజొన్న, శనగ పంటలకు అనుకూలం. అధిక వర్షాల వల్ల పత్తి, కంది తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చెరుకు సాగు చేసిన రైతులకు పెద్దగా నష్టం కలగలేదు. దీంతో ఈ ఏడాది రైతులు చెరుకు సాగు ఆసక్తి చూపుతున్నారు. ఎకరం పొలం కలిగిన రైతు కూడా బోరు వేసుకుని చెరుకు పండిస్తుంటారు. పలు కారణాల వల్ల రెండేళ్ల నుంచి ట్రైడెంట్‌ కర్మాగారంలో క్రషింగ్‌ నిలిచిపోవడంతో జిల్లా చెరుకు అధికారులు జహీరాబాద్‌ జోన్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించారు. ఇక్కడ పండించిన పంటను ఎక్కడికై నా తీసుకెళ్లి అమ్ముకోవచ్చని చెప్పారు. అదే సమయంలో రాయికోడ్‌ మండలంలో గోదావరి–గంగా కొత్తగా కర్మాగారం ఏర్పాటు కావడంతో ఊరట లభించింది. రెండు సీజన్ల నుంచి కర్మగారంలో క్రషింగ్‌ విజయవంతంగా పూర్తి చేశారు.

అధిక దిగుబడులు సాధ్యమే

తగిన యాజమాన్య పద్ధతులతో

ఉపయోగం

వ్యవసాయ పరిశోధన

శాస్త్రవేత్త విజయ్‌కుమార్‌

జహీరాబాద్‌: తగిన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా చెరుకు పంటలో అధిక దిగుబడులను సాధించవచ్చని బసంత్‌పూర్‌లోని వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని దిడిగి శివారులోని కేవీకేలో రైతులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చెరుకు పంటను నాటుకునేందుకుగాను సరైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలన్నారు. వరుసల మధ్యదూరం పాటించడం, మట్టి పరీక్షల ఆధారంగా తగిన మోతాదులో ఎరువులను వాడటం, కలుపు నియంత్రణ పద్ధతులను పాటించడం ద్వారా మంచి ఫలితాలుంటాయన్నారు. సమయానుకూల నీటిపారుదల, పురుగు, వ్యాధి నియంత్రణ చర్యలు చేపట్టడం, సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యతను పాటించడం ద్వారా ఆశించిన మేరకు దిగుబడులు వస్తాయన్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో రైతులు ఎకరానికి వంద టన్నుల వరకు చెరుకు పంట దిగుబడులు సాధిస్తున్నారన్నారు. దిగుబడులను పెంచుకునే దానిపై రైతులు శ్రద్ధ చూపాలని సూచించారు. నానో యూరియా, డీఏపీ వాడకం, పిచికారీ చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం వాటిపై ఏడీఏ భిక్షపతి, ఏఓ లావణ్యలు రైతులకు వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రమేశ్‌, సాయి ప్రియాంక, స్వామి, ఏడీఏ భిక్షపతి, ఏఓ లావణ్య, ఏఈఓలు ప్రదీప్‌కుమార్‌, రాజు, వీరేందర్‌, బీటీఎం చరణ్‌, రైతులు పాల్గొన్నారు.

జోరుగా ప్లాంటేషన్‌ పనులు

సాగు పట్ల రైతుల ఆసక్తి

పెరిగిన పంట సాగు విస్తీర్ణం

పంట నష్టం కల్గించదు

చెరుకు పంట ద్వారా లాభం తగ్గినా నష్టం మాత్రం రాదు. అందుకని వర్షాలు పడ్డా..పడకపోయినా..గిట్టుబాటు ధర ఉన్న లేకపోయినా ప్రతీ ఏటా పంట వేస్తాం. గతేఆడాది 8 ఎకరాల్లో పంట వేశాను. భారీ వర్షాలు పడ్డా నష్టంరాలేదు. అందుకని ఈసారి అదనంగా రెండు ఎకరాల్లో చెరుకు కొత్తగా ప్లాంటేషన్‌ చేస్తున్నా.

– డి.శివకుమార్‌, రైతు,ఎల్గోయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement