నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
కొండాపూర్(సంగారెడ్డి): జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియెట్ మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్య జిల్లాలో పరీక్షల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను సీఎస్‌కు వివరించారు. ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా 54 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 54 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 22 మంది అదనపు సూపరింటెండెంట్లు, 54 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు మూడు ఫ్లయింగ్ , నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 17,762 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 18,224 మంది విద్యార్థులు హాజరు కానుండగా, జిల్లాలో మొత్తం 35,986 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, పరిశుభ్రత, నిరంతర విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ప్రథమ చికిత్స సదుపాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్రాలను ముందస్తుగా తనిఖీ చేసి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పాండు, డీఈఓ వెంకటేశ్వర్లు, డీఐఈఓ గోవింద్‌రామ్, డీటీఓ కవిత, జెడ్పీసీఈఓ, డీపీఓ జానకిరెడ్డి, డీఎంఎల్‌హెచ్‌ఓ వసంత్‌రావు, ఆర్టీసీ, పోస్టల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు
ఇంటర్మీడియెట్ పరీక్షల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ పరితోశ్ పంకజ్ తెలిపారు. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, పరీక్ష కేంద్రం నుంచి 100 మీటర్ల పరిధిలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉంచకూడదని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌యస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, సెంటర్ల వద్ద గుంపులుగా తిరగడం నిషేధమని స్పష్టం చేశారు. ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఇతరులెవరూ పరీక్షా కేంద్రంలో సెల్‌ఫోన్ వినియోగించరాదని తెలిపారు. ప్రశ్నపత్రాలు పోలీస్‌స్టేషన్ నుంచి పరీక్ష కేంద్రాలకు, పరీక్ష అనంతరం పోస్టాఫీసుకు తరలించే వరకు ఎస్కార్ట్ ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని తెలిపారు.
పరిశ్రమల అనుమతులు వేగవంతం
సంగారెడ్డి జోన్: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న టీజీఐపాస్ విధానం ప్రకారం పారదర్శకత, వేగం తప్పనిసరన్నారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని అనుమతులను ఒకే వేదికపై అందించే విధానాన్ని అధికారులు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల పరిశీలనలో పొరపాట్లు లేకుండా వ్యవహరించాలన్నారు. సీఎస్‌ఆర్ నిధులతో విద్య, ఆరోగ్యం, హాస్టల్ సంక్షేమం వంటి అత్యవసర రంగాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పాండు, సీపీఒ బాలశౌరి, జీఎం డీఐసీ తుల్జారాం నాయక్, ఎల్‌డీఎం నర్సింగరావు, ఈడబ్ల్యూఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య


