శిక్షణ సరే! విధులేవీ?
లైెసెన్డ్స్ సర్వేయర్ల బాధ్యతలపై కొరవడిన మార్గదర్శకాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖలో లైసెన్డ్స్ సర్వేయర్ల విధుల విషయంలో స్పష్టత కరువైంది. శిక్షణ పూర్తి చేసుకుని దాదాపు మూడు నెలలు గడుస్తున్నప్పటికీ వీరికి కేటాయించే విధుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదు. దీంతో వీరు ఆయా మండలాల్లో ఖాళీగా ఉంటున్నారు. పెరుగుతున్న భూవివాదాలు..సర్వేయర్ల కొరత..ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం వినూత్నంగా లైసెన్డ్స్ సర్వేయర్ల విధానాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు టామ్‌కాం ద్వారా మూడు నెలలపాటు సర్వేపై శిక్షణ ఇచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టూల్స్ ద్వారా భూములను ఎలా సర్వే చేసే విధానంపై శిక్షణ ఇచ్చింది. ఫీల్డ్‌లో కూడా వీరు శిక్షణ తీసుకున్నారు. ఇలా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మండలాలను కూడా కేటాయించారు. కానీ వీరు ఎలాంటి విధులు చేయాలనే అంశంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదు. దీంతో ఆయా మండలాల్లో వీరు ఖాళీగా ఉంటున్నారు. నిత్యం మండల కార్యాలయానికి వచ్చి వెళ్తూ తమ విధులు, బాధ్యతల విషయంలో ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
డీజీపీఎస్ విధానంపైనా..
లైసెన్డ్స్ సర్వేయర్లకు ఆధునిక సాంకేతికతో కూడిన డీజీపీఎస్(డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) విధానంపై కూడా శిక్షణ ఇచ్చారు. సాంప్రదాయ పద్ధతులు గొలుసుల ద్వారా భూములు సర్వే చేస్తే ఎక్కువ సమయం పడుతుంది. ఇలాంటి డీజీపీఎస్ విధానం ద్వారా గంటల్లో పూర్తి చేసేందుకు వీలు కలుగుతుంది. ఈ ౖలైసెన్డ్స్ సర్వేయర్లకు ఈ డీజీపీఎస్ విధానంపైనా శిక్షణ ఇచ్చారు.
కొందరిని కేటాయించినప్పటికీ..
శిక్షణ పూర్తి చేసుకున్న ౖలైసెన్డ్స్ సర్వేయర్లలో కొందరికి రీ సర్వే గ్రామాల్లో విధులు కేటాయించారు. ఒక్కో గ్రామానికి ఇద్దరు చొప్పున కేటాయించారు. ఇలా కేటాయించిన వారు అతితక్కువ మంది మాత్రమే. రెండు జిల్లాల్లో కలిపి పది మంది కూడా ఉండరు. మిగిలిన వారు మాత్రం తమ విధులు, బాధ్యతలు ఏంటో ఇంకా స్పష్టత రాక ఎదురు చూస్తున్నారు.
రెండు విడతలుగా...
సంగారెడ్డి జిల్లాలో తొలి విడతలో 74 మందికి లైసెన్డ్స్ సర్వేయర్లుగా శిక్షణ ఇచ్చారు. వీరిని 28 మండలాలకు కేటాయించారు. వీరు దాదాపు మూడు నెలలుగా ఖాళీగా ఉంటున్నారు. అలాగే రెండో విడతలో శిక్షణ తీసుకున్న వారు 22 మందికి కూడా మండలాలను కేటాయించాల్సి ఉంది.
మెదక్ జిల్లాలో 82 మంది శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. వీరికి కూడా 21 మండలాలను కేటాయించినప్పటికీ..విధులు, బాధ్యతల విషయంలో స్పష్టత రాకపోవడంతో ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
మండలాలు కేటాయించినప్పటికీ మూడు నెలలుగా ఖాళీ
సంగారెడ్డి జిల్లాలో 74 మంది.. మెదక్‌లో 82 మందికి


