రేవంత్ పాలనలో అన్నీ బంద్
పటాన్‌చెరు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని పథకాలను బంద్ చేసి ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆయన పటాన్‌చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇస్నాపూర్‌లోని బీఆర్‌ఎస్ నాయకుడు గడీల శ్రీకాంత్‌గౌడ్ ఇంట్లో ఓ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ... బతుకమ్మ చీరలు, క్రిస్టియన్–ముస్లింలకు ఇచ్చే కానుకలు, రైతుబంధు, దళిత బంధు, గొర్రెల పంపిణీ..ఇలా కేసీఆర్ ఇచ్చినవన్నీ ఈ ముఖ్యమంత్రి బంద్ పెట్టి బంద్‌ల బాబుగా రేవంత్ మారిపోయారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇస్నాపూర్‌లో పవర్ హాలిడేస్ ఉండేవని కేసీఆర్ సీఎం అయ్యాక ఇరవైనాలుగు గంటల కరెంట్ ఇవ్వడంతో ఇక్కడ పరిశ్రమల్లో కార్మికులకు ఓటీలు దొరికి నాలుగు రూపాయలు సంపాదించుకునేవారు. కానీ ఇప్పుడు మళ్లీ కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయని తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో మీకు అందుబాటులో ఉండే వాళ్లకు, మీ భవిష్యత్తును బాగా చూసుకునే వాళ్లకు ఓటువేయాలని వి జ్ఞప్తి చేశారు. ఇస్నాపూర్ అభివృద్ధి కొనసాగాలన్నా, పేదల సంక్షేమ పథకాలు మళ్లీ రావాలన్నా కారు గుర్తుకు ఓటేసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో గడీల శ్రీకాంత్‌గౌడ్, వెన్నవరం ఆదర్శరెడ్డి, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పాల్గొన్నారు.
రాళ్లకత్వలో హరీశ్‌రావు ప్రచారం
జిన్నారం(పటాన్‌చెరు): జిన్నారం పట్టణ పరిధిలోని రాళ్లకత్వలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున హరీశ్‌రావు ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. జిన్నారం మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ జెండా ఎగరవేయాలని కోరారు. అనంతరం జిన్నారం పట్టణ కేంద్రంలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్‌చార్జి పాల సాయిరాం, నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, రాష్ట్ర యువత నాయకులు వెంకటేశంగౌడ్, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికలప్రచారంలో మాజీ మంత్రి హరీశ్‌రావు


