
యూట్యూబ్ రిపోర్టర్ అరెస్ట్
రామాయంపేట(మెదక్): సర్వేయర్‌ను బెదిరించి ఉంగరం, నగదు లాక్కున్న యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్‌ను సోమవారం స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ బాల్‌రాజ్ వివరాల ప్రకారం... నార్సింగి మండల కేంద్రంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న ఎనిశెట్టి శ్రీకాంత్‌ను లంచాలు తీసుకుంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నావని పలుమార్లు యూట్యూబ్ రిపోర్టర్ లింగంగౌడ్ బెదిరించాడు. ఈనెల 7న అతని వద్ద నుంచి ఫోన్‌పే ద్వారా రూ. 5వేలు వేయించుకున్నాడు. మరునాడు తిరిగి శ్రీకాంత్‌కు ఫోన్ చేసిన లింగంగౌడ్ మెదక్‌కు పిలిపించుకుని రూ. రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితుడు డబ్బులు ఇవ్వకపోవడంతో అతని వద్ద ఉన్న రూ. మరో ఐదు వేలు, చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని లాక్కున్నాడు. శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి బంగారు ఉంగరం, కారును స్వాధీనం చేసుకున్నారు.