
కేవీకే ల్యాబ్
ల్యాబ్‌లో తయారు చేసే జీవ ఎరువులు
కౌడిపల్లి(నర్సాపూర్): పంటల సాగుకు జీవ ఎరువుల ఎంతో ప్రధానం. రసాయన ఎరువుల వాడకంతో ఆహారం పంటలు, నేల, నీటి కలుషితం అవుతున్నాయి. దీనికితోడు భూసారం తగ్గిచౌడుగా మారుతుంది. వీటన్నింటికీ ఈ ఎరువులతో చెక్ పెట్టవచ్చన్నారు. భూమి సారవంతమై పంటల దిగుబడి పెరుగుతుందని స్వచ్ఛమన ఆహారం ధాన్యాల పండి మానవాళి ఆరోగ్యం బాగుంటుందని కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కౌడిపల్లి మండలం తునికి వద్దగల డాక్టర్ డీ రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో రూ.55 లక్షలతో జీవ ఎరువుల తయారీ ల్యాబొరేటరీ ప్రారంభించారు. అందులో ఎరువులను తయారు చేసి అమ్మకానికి ఉంచారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎఫ్‌సీఓ (ఫర్టిలైజర్ కంట్రోల్ అథారిటీ) ఎఫ్‌సీఓ 1985 ప్రకారం ఏర్పాటు చేసినట్లు కేవీకే సీనియర్ శాస్త్రవేత్త ల్యాబ్ ఇన్‌చార్జి రవికుమార్ తెలిపారు.
జీవ ఎరువుల అవసరం ఏమిటీ?
మన దేశ జనాభాలో ఇప్పటికీ 70 శాతం ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. దేశ తలసరి ఆదా యం పెంచాలంటే వ్యవసాయ ఉత్పాదక పెంపుదలతోపాటు సాగు ఖర్చు తగ్గించుకోవడం తప్పనిసరి. పంటల్లో ఉత్పాదకతను పెంపొందించాలంటే ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్‌లను అందించే రసాయన ఎరువుల వినియోగం తప్పనిసరి. పెరుగుతున్న శిలాజ ఇంధనాల ధరలు, ఉత్పత్తి వ్యయంలో పెరుగుదల, ప్రతి ఏటా మన దేశం దిగుబడి చేసుకుంటున్న భాస్వరం, పొటాష్ ఎరువుల సబ్సిడీ వేల కోట్లలో ఉండటంతో మోయలేని భారం అవుతుంది. కాగా, ప్రస్తుత పరిస్థితులలో రైతులు రసాయన ఎరువుల మోతాదును తగ్గించి, జీవన ఎరువులైన రైజోబియం, అజటోబాక్టర్, పీఎస్‌బీ, మైకోరైజా వంటి వాటిని వినియోగించడం ద్వారా సాగు ఖర్చును తగ్గించుకోవడంతోపాటు నేలలో పోషకాల సమతుల్యత దెబ్బతినకుండా కాపాడటం ద్వారా భూసారాన్ని పెంచి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని కేవీకే శాస్త్రవేత్త, ల్యాబ్ ఇన్‌చార్జి రవికుమార్ ల్యాబ్ అసిస్టెంట్ ఆఫీసర్ హింగే తెలిపారు.
అన్ని రకాల పంటలకు సిఫారసు
కేవీకేలో లభ్యమయ్యే జీవన ఎరువులను వాటి సిఫారసు మేరకు వివిధ వ్యవసాయ, ఉద్యాన పంటల్లో ఉపయోగించడం ద్వారా నేల, నీటి కాలుష్యం అరికట్టి సుస్థిర, నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు. వరి, జొన్న, గోదుమ, తృణధాన్యాలు, పత్తి, మిరప, చెరుకు, పసుపు, కూరగాయలు, పండ్లతోటలలో జీవ ఎరువులు వాడవచ్చు.
1. రైజోబియం
2. అజోస్పైరిల్లమ్
3. అజోటోబ్యాక్టర్
4. ఫాస్పరస్ సాల్యుబులైజింగ్ బాక్టీరియా
5. మైకోరైజా జీవన ఎరువు
6. పొటాషియం సాల్యుబులైజింగ్ బాక్టీరియా
7. అసిటోబ్యాక్టర్
8. జింక్‌ను కరిగించే బాక్టీరియా
తునికి కేవీకేలో రూ. 55 లక్షలతో
ల్యాబ్ ఏర్పాటు
సేంద్రియ సాగుకు అనుకూలం
తగ్గనున్న నేల కాలుష్యం..
పెరగనున్న భూసారం
తక్కువ ఖర్చు.. అధిక దిగుబడి
రైతులకు మేలు
జీవ ఎరువులతో రైతులకు ఎంతో మేలు. ప్రధానంగా నేల కాలుష్యం, నీటి కాలుష్యం తగ్గించి భూసారం పెంచుతుంది. సేంద్రియ సాగుకు అనుకూలమైంది. నాణ్యమైన రసాయన రహిత ఆహారధాన్యాలు పండుతాయి. దీంతో ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ప్రస్తుత మార్కెట్‌లో సేంద్రియ ఆహార ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది.
రవికుమార్, కేవీకే శాస్త్రవేత్త
ల్యాబ్ ఇన్‌చార్జి
