ఢిల్లీకి కోనసీమ ‘ప్రభ’.. ప్రభుత్వానికి కోనసీమ వాసుల కృతజ్ఞతలు

Story On Konaseema Prabhala Theertham Selected For Republic Day Parade Delhi - Sakshi

కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్‌ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ‘డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ’ తన సంస్కృతి సంప్రదాయాలతో మరోసారి జాతీయస్థాయి ఖ్యాతినార్జించనుంది. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే తీర్థానికి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభల నమూనా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్ర శకటంపై కొలువుదీరనుంది.  
–సాక్షి అమలాపురం

తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన సంక్రాంతి పండుగ కనుమ రోజు జరిగే జగ్గన్నతోట తీర్థానికి 11 గ్రామాలకు చెందిన ప్రభలు వస్తాయి. ప్రభ మీదనే పరమేశ్వరుని ఉత్సవ విగ్రహాలు ఉంచి ఊరేగింపుగా తీర్థాలకు తీసుకువస్తారు. దీనికి 450 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రభలపై పరమేశ్వరుని ప్రతిరూపాలు ఇక్కడకు వచ్చి లోక కళ్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

అరుదైన గుర్తింపు 
గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివ కేశవ యూత్‌ సభ్యులు ఈ తీర్థ విశేషాలను దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తూ 2020లో మెయిల్‌ చేశారు. మోదీ తీర్థం ప్రాశస్త్యాన్ని అభినందించారు. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు వెళ్లే రాష్ట్ర ప్రభుత్వ శకటంపై జగ్గన్నతోట తీర్థానికి వచ్చే ఏకాదశ రుద్రులను ప్రదర్శనకు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించినట్టయ్యింది. ప్రభుత్వ నిర్ణయానికి కోనసీమ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమలోని పంట కాలువలు, వరి చేలు, కొబ్బరి తోటలు, రహదారుల మీదుగా ఊరేగే  ప్రభలు ఈ ఏడాది ఢిల్లీలోని గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో రాష్ట్ర శకటంపై ఊరేగనున్నాయి.  
చదవండి: రిపబ్లిక్‌ డే పరేడ్‌ రిహార్సల్స్‌లో ఏపీ ప్రభల తీర్థ శకటం

ముచ్చట గొల్పుతున్న ఏకాదశ రుద్రులు 
పరేడ్‌ శకటంపై ఉంచే ప్రభలను తాటి శూలం, టేకు చెక్క, మర్రి ఊడలు, వెదురు బొంగులతో సంప్రదాయ బద్ధంగా తయారు చేశారు. రంగు రంగుల నూలుదారాలు (కంకర్లు), కొత్త వస్త్రాలు, నెమలి పింఛాలతో అలంకరించారు. శకటానికి మూడు వైపులా మూడు చొప్పున తొమ్మిది చిన్న ప్రభలు, శకటం మధ్యలో రెండు పెద్ద ప్రభలు నిర్మించారు. కొబ్బరి చెట్లు, మేళతాళాలు, గరగ నృత్యకారులు, వేదపండితులు, పల్లకీ, దానిని మోస్తున్న కార్మికుల బొమ్మలు, తీర్థానికి గూడెడ్ల బండ్ల మీద వచ్చే వారి నమూనాలతో శకటాన్ని తీర్చిదిద్దారు. వరి కుచ్చులు, గుమ్మడి కాయలు, ఇతర కూరగాయలతో అలంకరించారు. 

గరగ ప్రదర్శనకు అవకాశం 
పరేడ్‌లో ప్రదర్శనకు అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు గరగ బృందం ఎంపికైంది. ఈ బృందంలో సుమారు 24 మంది ఉన్నారు. గతంలో నాగపూర్‌ కల్చరల్‌ సెంటర్‌ ద్వారా ఈ బృందం 15 సార్లు పరేడ్‌లో పాల్గొంది. అయితే ఈసారి ప్రభల తీర్థం శకటం ప్రదర్శన సందర్భంగా ఈ బృందానికి నేరుగా పాల్గొనే అవకాశం లభించింది. 

మన ప్రాంతానికి దక్కిన గుర్తింపు 
ప్రభల తీర్థం అంటే మన సంప్రదాయం. రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఏకదశ రుద్రుల కొలువు దీరడం అంటే అది మన తీర్థానికి, మన ప్రాంతానికి దక్కిన గుర్తింపు. ఆ తీర్థంలో మాది ముఖ్యపాత్ర కావడం మా పూర్వ జన్మసుకృతం. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. 
– పూజ్యం శ్రీనివాస్, అర్చకుడు 

స్వతంత్రంగా తొలిసారి 
గతంలో పలుమార్లు రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొన్నాం. రాష్ట్రపతులు శంకర్‌ దయాళ్‌ శర్మ, వెంకటరామన్, అబ్దుల్‌ కలాం, ప్రతిభాపాటిల్, ప్రధానులు రాజీవ్‌గాంధీ, పి.వి.నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ ముందు మా ప్రదర్శన జరిగింది. కోనసీమ ప్రభలు పరేడ్‌కు వెళుతున్నందున స్వతంత్రంగా తొలిసారి మా బృందం ప్రదర్శనకు సిద్ధమైంది. 
– పసుపులేటి నాగబాబు, గరగ బృందం గురువు 

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top