చిల్లర నేత చిందులాట.. రామోజీకి తన సినిమా డైలాగ్‌ గుర్తుందో లేదో?

Hitaishi Comments On TDP And Eenadu Ramoji Rao Fake News Campaign - Sakshi

కుట్రలు, కుతంత్రాలు ఏదో ఒక రోజు బటయపడతాయని అంటారు. అబద్దాలు ఆడేవారు ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతారన్నది నానుడి. సరిగ్గా ఈనాడు మీడియా పరిస్థితి అలాగే ఉందని చెప్పాలి. గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైనా విషం కక్కుతున్న వైనం ఇప్పుడు మరింత ఓపెన్‌గా బహిర్గతమైంది. తెలుగుదేశం పార్టీ చోటా నాయకుడిని మహానాయకుడిగా చూపించడానికి, అతగాడు చేసే విన్యాసాలను మహా పోరాటంగా చిత్రించడానికి ఈనాడు పడ్డ పాట్లు ఇట్టే తెలిసిపోయాయి.

రామోజీ ఈ డైలాగ్‌ గుర్తుందా?
ఈనాడు బ్యానర్ చూడగానే ప్రఖ్యాత స్వాతంత్రయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఏమైనా బతికి వచ్చారా? ఆయనకు ఏమైనా జరిగిందా? అన్న సందేహం వచ్చింది. తీరా మొత్తం కథనం చదివితే ఇదంతా ఒక చిల్లర నేత చేసిన ఆరోపణ అని అర్ధం అవుతుంది. ఈనాడు ఈ రకంగా తన స్థాయిని ఇంతగా దిగజార్చుకుంటుందని గతంలో ఊహించలేకపోయాం. తన క్షుద్ర రాజకీయం కోసం ఈనాడు ఎంతకైనా పతనం అవుతుందని ఈ ఘటన తెలియచెబుతుంది. సుమారు 35 ఏళ్ల క్రితం ఈనాడు అధినేత రామోజీరావు ఒక సినిమా తీశారు. దాని పేరు ప్రతిఘటన. అందులో కొన్ని పవర్ ఫుల్ డైలాగులు ఉంటాయి. ఒక రౌడీకి ఖద్దరు చొక్కా తొడిగి రాజకీయ నాయకుడిని చేశారని అందులో ఒక స్వాతంత్ర యోధుడు అంటారు. సరిగ్గా ఇప్పుడు ఈనాడు అదే పనిలో ఉన్నట్లు అనిపిస్తుంది.

బురద చల్లడమే ఈనాడు కర్తవ్యం..
తెలుగుదేశంలో ఎవరు చిల్లరమల్లరగా వ్యవహరిస్తారో, నోటికి వచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్‌ను దూషిస్తారో వారందరికీ విపరీత ప్రాధాన్యం ఇస్తూ వారిని మహా నాయకులుగా చిత్రీకరించడానికి తంటాలు పడుతోంది. తద్వారా వైఎస్సార్‌సీపీపై బురద చల్లడమే ఈనాడు తన కర్తవ్యంగా పెట్టుకుంది. బుధవారం నాటి పత్రిక గమనిస్తే సహజంగానే సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రకమైన ఆరోపణలను టీడీపీ చేసిన విషయం గుర్తుకు వస్తుంది. ఒక చోటా నేతను పోలీసులు కొట్టారంటూ ఏవో కొన్ని ఫొటోలను అప్పట్లో ప్రచురించారు. అదే తరహాలో మళ్లీ ఫొటోలు వచ్చాయేమిటా అనిపించింది. ఆ తర్వాత కొద్ది గంటల్లో అసలు రహస్యం బట్టబయలు అయింది.

గతసారి వేసిన ఫొటోలనే ఇప్పుడు కూడా వేసి ఆ చోటా నేతను పోలీసులు కొట్టారంటూ కథ అల్లింది. సరే, కోర్టులో కూడా అదే తరహాలో చెప్పారు. అది వేరే సంగతి. వైద్యులు ఆ చోటా నేతను పోలీసులు కొట్టలేదని ధృవీకరించారు. ఈలోగా ఈనాడు ఎందుకో భయపడింది. రెండేళ్ల క్రితం వేసిన ఫొటోలనే ప్రచురించి తప్పు చేశారన్న సంగతి సోషల్ మీడియాలో ఎక్స్‌పోజ్ అవడంతో తప్పనిసరి స్థితిలో టీవీలలో పాత ఫొటోలను ప్రచారం చేశామని, అది సాంకేతిక తప్పిదం వల్ల జరిగిందని.. ఇందుకు విచారిస్తున్నామని తెలిపింది. దీంతో, ఈనాడు మీడియా పరువు పూర్తిగా పోయినట్లయింది. బహుశా తాను చేసిన మోసాన్ని పోలీసులు పట్టుకుని కేసులు పెడతారని ఆందోళన చెంది ఈనాడు వారు ఈ వివరణ ఇచ్చి ఉంటారనిపిస్తుంది. అందులో కూడా నిజాయితీ కనిపించలేదు. 

ఇదే మొదటిసారి కాదు.. 
మంగళవారం తీసిన ఫొటో అంటూ సన్నాయి నొక్కుడుకు పాల్పడింది. మంగళవారం నాటి ఫొటోనే అయితే.. రెండేళ్ల క్రితం ఫొటో అక్కడ ఎలా ప్రత్యక్షమవుతుందో తెలియదు. ఇదంతా అబద్దమని, చేసిన తప్పును సమర్ధించుకునే యత్నమని తెలిసిపోతుంది. ఈనాడు ఇవ్వాళ ఒక్కరోజే ఇలా చేసిందని అనుకోజాలం. కొద్ది రోజుల క్రితం ఛీప్ సెక్రటరీ వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించినప్పుడు కడపలో వేరే కేసులో సీబీఐ విచారణకు హాజరైన ముఖ్యమంత్రి.. ఓఎస్‌డీని కారులో ఎక్కించుకుని వెళ్లారంటూ తప్పుడు వార్తను ప్రచారం చేసింది. దానిని ఛీప్ సెక్రటరీ జవహర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అప్పుడు ఏ మీడియా అయినా ఏం చేయాలి. వారు ప్రచారం చేసిన వార్త సరైనదే అయితే, తమ వార్తకు కట్టుబడి ఉన్నామని చెప్పాలి. లేదా విచారం వ్యక్తం చేయాలి. 

కానీ.. వారు కేవలం సీఎస్‌ ఇచ్చిన ప్రకటనను కొద్దిగా ఇచ్చేసి వదలివేశారు. నిత్యం ముఖ్యమంత్రి జగన్‌ను, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఈనాడు విశేష కృషి చేస్తోంది. 86ఏళ్ల వయసులో ఆ పత్రిక అధినేత రామోజీరావు తన పరువు, ప్రతిష్ట మంటకలిసిపోయినా ఫర్వాలేదు కానీ.. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండడానికి వీల్లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంలో లోటుపాట్లు వార్తలుగా ఇస్తే తప్పు కాదు. కానీ, అదే పనిగా తప్పుడు ప్రచారం చేయడానికి, అభూత కల్పనలు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకే తరహా వార్తలను తెలంగాణలో ఒక రకంగాను, ఏపీలో మరో రకంగాను ఇస్తున్నారు. 

ఏపీలో పెట్టుబడులు కనిపించవా?
ఉదాహరణకు తెలంగాణలో 200 కోట్ల పెట్టుబడి వచ్చినా, చాలా గొప్ప విషయంగా మొదటి పేజీలో ప్రచురిస్తుంటారు. అదే ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు వచ్చినా, అసలు ప్రాధాన్యమే ఇవ్వరు. ఈ మధ్య జమ్మలమడుగు వద్ద 8,800 కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పారిశ్రామికవేత్త జిందాల్ శంకుస్థాపన చేస్తే దానిని మొక్కుబడిగా కవర్ చేశారు. పైగా బ్యానర్‌గా రోజువారీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసే ఒక చెత్త వార్తను ప్రచురించారు. విశాఖలో రిషి కొండపై ఎన్ని దారుణమైన వార్తలు రాస్తున్నారో చూస్తున్నాం. ఇదే రిషి కొండపై గత ప్రభుత్వ హయాంలో రోడ్డు వేస్తే, కొండకే హారం చుట్టినట్లు రాసిన ఈ పత్రిక.. ఇప్పుడు అక్కడ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను మాత్రం విధ్వంసంగా ప్రచారం చేస్తోంది.

చంద్రబాబు కన్నా ఆయనే తోపా?
ఈ రెండు క్లిప్పింగ్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా ఒకటని కాదు.. అనేక కథనాలలో ఇలాగే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని ప్రచారం చేస్తున్న ఈనాడు బుధవారం నాటి పత్రికలో గన్నవరంలో ఆ పార్టీ చోటా నేత, మరికొందరు చేసిన అల్లరి పక్కనపెడితే, ఆ చోటా నేతను పోలీసులు కొట్టారంటూ కథనాలు ఇచ్చారు. స్క్రిప్ట్‌ ప్రకారమే ఆ చోటా నేత కూడా తనను పోలీసులు హింసించారంటూ కోర్టుకు తెలిపారు. ఈ వార్తలకు ఈనాడు పత్రిక ఏకంగా మూడు పేజీలను కేటాయించిందంటే వారు ఎంత కక్షకట్టారో ఇట్టే తెలిసిపోతుంది. టీడీపీలో ఆ చోటా నేతే చంద్రబాబు కన్నా ప్రముఖుడు అన్నట్లుగా వార్తలు ఇవ్వడం టీడీపీలోని వారికే మింగుడు పడటంలేదు. ఇతగాడు పార్టీ పరువును తీస్తున్నాడని వాపోతున్నారట. అసలు ఈయనకు ఇంత ధైర్యం అన్న విశ్లేషణ చేస్తే ఒక విషయం బయటపడుతోంది. 

గతసారి ముఖ్యమంత్రి జగన్‌ను దూషించిన కేసులో గౌరవ హైకోర్టు వారు అడ్వాన్స్ బెయిల్ ఇచ్చారు. దాంతో అతనికి అతి విశ్వాసం వచ్చి ఉండవచ్చు. న్యాయ వ్యవస్థను తేలికగా తీసుకోవచ్చన్న భావన ఏర్పడి ఉండవచ్చు. ఈ క్రమంలో అప్పటి నుంచి మరింతగా రెచ్చిపోయి వైఎస్సార్‌సీపీ వారిపై దూషణలకు పాల్పడటం, నిత్యం అబద్దాలు ప్రచారం చేయడం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ.. ఇతనికి ఇస్తున్న ప్రాధాన్యత చూసి ఇతర ముఖ్యనేతలే ఆశ్చర్యం చెందుతున్నారు. ఎప్పుడో ఓసారి ఇతను ఏకుమేకై చంద్రబాబునే బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారట.

వల్లభనేని వంశీపై వ్యతిరేక ప్రచారం..
నిజంగా గన్నవరం ఘటనల నేపథ్యంలో పోలీసులు ఎవరినైనా కొట్టి ఉంటే ఎవరూ సమర్దించరు. కానీ, పోలీసులను గాయపరచడమే కాకుండా, వారినే బెదిరించడమే పనిగా టీడీపీ నేతలు పెట్టుకుంటున్నారు. దానివల్ల వారికి రాజకీయ ప్రయోజనం వస్తుందనుకుంటే అది భ్రమే అవుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత ఎన్నికలలో టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. తదుపరి ఆయన పార్టీకి దూరం అయ్యారు. అప్పటి నుంచి ఆయనపై టీడీపీ సోషల్ మీడియాలో దారుణమైన వ్యతిరేక ప్రచారం చేస్తుంటారట. దానిని ఆయన తిప్పికొడుతూ తీవ్ర వ్యాఖ్యలే చేస్తుంటారు. గత కొంతకాలంగా ఇది జరుగుతూనే ఉంది. 

ఈ క్రమంలో టీడీపీ చోటా నేత ఎంటర్ అయి వంశీపైన నోరుపారేసుకోవడం, లేని ఆరోపణలు చేయడం, వైఎస్సార్‌సీపీ వారిని రెచ్చగొట్టేలా వ్యవహరించడం చేశారని వార్తలు వచ్చాయి. దాంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కూడా కొంత తొందరపడి ఉండవచ్చు. పోలీసులు రెండువైపులా కేసులు పెట్టారు. ఇరుపక్షాల నుంచి అదుపులోకి తీసుకున్నారు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అనడం ఆనవాయితీగా మార్చుకున్నారు. రాష్ట్రంలో ఏదో విధంగా శాంతి భద్రతల సమస్య సృష్టించాలని తెలుగుదేశం, ఈనాడు వంటి మీడియా సంస్థలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ వారిని ఎలాగోలా రెచ్చగొట్టేలా చేయాలన్నది వారి వ్యూహం కావచ్చు. 

చంద్రబాబు కన్నింగ్‌ ప్లాన్‌ ఇదే..
దానికి తోడు ప్రభుత్వం లేదా వైఎస్సార్‌సీపీ ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి చంద్రబాబు ఇలాంటి వ్యూహాలు అమలు చేయడంలో దిట్టగా భావిస్తారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో 18 స్థానాలకు గాను 11 మంది బీసీలకు పదవులు ఇవ్వడానికి వైఎ‍స్సార్‌సీపీ ప్రకటన చేసిన రోజునే ఈ గొడవ సృష్టించడంలో ఆంతర్యం ఇదేనని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మొత్తం పరిణామక్రమం, టీడీపీ రాజకీయ చరిత్ర గమనిస్తే, ఇది వాస్తవమే అనిపిస్తుంది. 

అయినప్పటికీ టీడీపీ రెచ్చగొట్టినా వైఎస్సార్‌సీవారు ఆవేశపడకుండా ఉండాలని ఈ ఘటన తెలియచెబుతుంది. వారు సంయమనంగా లేకపోతే మొత్తం నెపం అంతా ప్రభుత్వంపైన, వైఎస్సార్‌సీపీపైన నెట్టేసి బద్నాం చేయాలని టీడీపీ యత్నిస్తుంది. ఇదే సందర్భంలో మరో మాట చెప్పాలి. పాదయాత్ర చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి లోకేష్.. వైఎస్సార్‌సీపీ వారు ఒక్క టీడీపీ ఆఫీసుపై దాడి చేస్తే, తాము వంద వైఎస్సార్‌సీపీ ఆఫీసులపై దాడి చేస్తామని అనడం శోఛనీయం. అంతేకాదు.. కట్ డ్రాయర్ల మీద ఉరికిచ్చి కొడతారట. ప్రభుత్వం వస్తే ఈయనే పోలీసుల పోస్టింగ్స్‌ ఇస్తారట. ఇన్ని రకాలుగా రెచ్చగొడుతూ పోలీసు అధికారులను బెదిరిస్తున్న తీరు అర్దం అవుతూనే ఉంది కదా!. వైఎస్సార్‌సీపీ వారిని రెచ్చగొట్టాలన్నదే వారి వ్యూహం. కనుక ఈ ఎన్నికల సంవత్సరంలో అధికార వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అత్యంత జాగ్రత్తగా, పూర్తి సంయమనంగా ఉండాలి.
 -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. 

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top